Collector Koya Sri Harsha | పెద్దపల్లి, సెప్టెంబర్19: ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారలకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఇంటర్ ఫలితాలు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా అధ్యాపకులు అప్రమత్తంగా ఉంటూ గమనించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, కళాశాలలలో చేపట్టాల్సిన మరమ్మత్తు, అభివృద్ధి పనుల జాబితా సిద్ధం చేసి, పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన, టీజీ డబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ గిరిష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.