Collector Koya Sri Harsha | పెద్దపల్లి, సెప్టెంబర్12 : పెద్దపల్లి జిల్లాలో వానాకాలం పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక, మౌలిక వసతులు, తదితర అంశాలను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్వింటాల్ గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.2389, సాధారణ రకం ధాన్యానికి రూ.2369 మద్దతు ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తో కలిసి కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. అభివృద్ధి పనులు నిర్ధేశిత గడువులోగా చేయాలని, పనులు ఆలస్యమైతే నిర్మాణ ఖర్చులు పెరిగి ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ భావ్ సింగ్, డీపీవో వీర బుచ్చయ్య, పీఆర్ ఈఈ గిరీష్ బాబు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ రామన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.