Indiramma house | ధర్మపురి, ఆగస్టు 03: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకొలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు విచారణ చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామంలో 60 కుటుంబాలను ఇల్లులేని లేనివారిగా గుర్తించారు. ఇందులోనుంచి మొదటి లిస్టులో 27 మంది లబ్దిదారులను ఫైనల్ చేసి ప్రొసీడింగ్స్ అందజేశారు. అయితే గోపులాపూర్ గ్రామానికి చెందిన దళితులైన నాతరి లక్ష్మి మొండయ్యలు పూర్తి శిథిలావస్థకు చేరిన ఇంట్లో నివసిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు మంజూరు చేయించాలని కాంగ్రెస్ నాయకుల కాల్లు పట్టుకున్నారు.
లక్ష్మీ మొండయ్యలు రోజూవారి కూలీచేసుకుంటు జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే వీరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఓ రోజు ఇందరిమ్మ కమిటీ సభ్యులు తెలిపారు. ఖాళీ జాగ చూపిస్తే ముగ్గు పోసుడే అన్నారు. దీంతో వీరు ఉన్న ఆమాత్రం ఇంటిని కూలగొట్టుకున్నరు. పక్కనే ఉన్న మరొకరి ఇంటి స్థలంలో తాత్కాలికంగా టార్ఫాలిన్ కవర్లతో గుడిసె చేసుకొని ప్రస్తుతానికి నివసిస్తున్నారు. ఇల్లు కూలగొట్టి ఖాళీ జాగా చూపిస్తే వచ్చి ముగ్గుపోస్తామని చెప్పిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు చివరికి లిస్టులో పేరులేదని చేతులెత్తేశారు. ఇప్పుడు ఏంచేయాలో తోచక లబోదిబోమంటున్నారు.
నాతరి లక్ష్మి- మొండయ్య విషయమై గ్రామ కార్యదర్శి ఎమ్‌డి అమీర్ ను వివరణ కోరగా గ్రామంలో 27 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, అయితే అందులో నాతరి లక్ష్మి పేరు గల వారు మరో ముగ్గురు ఉన్నారని, ఇందులో నాతరి లక్ష్మి- మొండయ్య పేరులేదని స్పష్టం చేశారు. న్యాతరి లక్ష్మికి అధికారికంగా ఇల్లు మంజూరైందని చెప్పలేదని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పి ఉండవచ్చన్నారు. అయితే 27 మందిలో ఐదుగురు నాన్ విల్లింగ్ ఉన్నారని, అందులో నాతరి లక్ష్మి కి అవకాశం కల్పిస్తామని తెలిపారు.