కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 1 : అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే నగరం నడిబొడ్డున మల్టీపర్పస్ స్కూల్ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌లోని మల్టీపర్పస్ స్కూల్ పార్కులో మ్యూజికల్ ఫౌంటేన్ పనితీరును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ తాను కలిసి ప్రణాళికతో పార్కును అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. స్మార్ట్‌సిటీ కింద ఈ పార్కుతో పాటు సర్కస్‌గ్రౌండ్ పార్కును సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించామని చెప్పారు. దక్షిణ భారతంలోనే అద్భుతమైన ప్రాజెక్టు మానేరు రివర్ ఫ్రంట్‌ను చేపట్టామన్నారు.
ఈ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని, అలా చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని సూచించారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్న కారణంతో పనులు పూర్తి చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
రాబోయే రోజుల్లో నగరంలో ఈ రెండు పార్కులను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు సాగర్, వాల రమణారావు, మహేశ్, తోట రాములు, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, గందె మహేశ్ తదితరులు పాల్గొన్నారు.