PEDDAPALLY | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 10 : రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు.
పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల గ్రామంలోని రేషన్ బియ్యం లబ్ధిదారురాలు చిటవేని లక్ష్మిరవి దంపతుల ఇంట్లో గురువారం రేషన్ సన్న బియ్యంతో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయశ్రీహర్ష మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేనివిధంగా రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు లేకుండా ప్రతీకార్డుదారు సన్నబియ్యం తీసుకెళ్తున్నారన్నారు. అంతకు ముందు ప్రతీ నెల 17 దాటినా ఎంతో కొంత బియ్యం ఉండేవని, అలాంటిది ఇప్పటి వరకే రేషన్ దుకాణాల్లో 90శాతం పంపిణీ పూర్తి అయిందని అన్నారు. సన్నబియ్యం పథకంతో డీలర్లకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పినట్లున్నాయన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగానే సీఎం రేవంత్ సర్కార్ పని చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేదలపక్షపార్టీ అని, ప్రస్తుతం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులవుతున్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్ లు , ఆయా పార్టీల నాయకులు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, సలేంద్ర రాజయ్య యాదవ్, అర్కుటి సంతోష్ యాదవ్, కొట్టె సదానందం, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, డీలర్లు, నాయకులు పాల్గొన్నారు.