కరీంనగర్ : దేశంలో త్వరలో చేపట్టనున్న ఎంపీ స్థానాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 1971 నిష్పత్తి ప్రకారమే పునర్విభజన చేస్తారని భావిస్తున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వినోద్ కుమార్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం లేదని హోంమంత్రి అమిత్ షా అంటున్నారని గుర్తుచేశారు.
అందుకే 1971 నిష్పత్తి ప్రకారమే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తారని తాను భావిస్తున్నానని వినోద్ కుమార్ చెప్పారు. ఒకవేళ జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని పునర్విభజన చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ఊరుకునే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక ఆదాయం వస్తున్నదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి 100 రూపాయలు ఇస్తే అందులో 42 శాతం మాత్రమే తిరిగి వస్తున్నదని అన్నారు. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు మాత్రం 100 రూపాయలకు 400 నుంచి 600 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. ఈ లెక్క ప్రకారం ఎంపీ స్థానాలు తగ్గితే దక్షణాది రాష్ట్రాలు తిరగబడుతాయని అన్నారు.