CP Amber Kishore Jha | ధర్మారం, ఆగస్టు 21: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి మాదకద్రవ్యాల రవాణా జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడారు. మాదకద్రవ్యాలు గంజాయి, డ్రగ్స్ రవాణా కాకుండా నిరోధంపై పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించగా ఆయన స్పందించి మాట్లాడారు.
మాదకద్రవ్యాల ప్రాంతాలలో పోలీస్ శాఖ ద్వారా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. పోలీసు బృందాలు కూడా డ్రగ్స్ నివారణ పై ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిపై పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే డ్రగ్స్ ను రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రాకుండా పోలీస్ శాఖ కచ్చితంగా అడ్డుకొని తీరుతుందని సిపి అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా డ్రగ్స్ కంట్రోల్ కోసం ట్రాకింగ్ డాగ్స్ ను కూడా ఏర్పాటు చేశామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలో జరగబోయే వినాయక ఉత్సవాలను నిర్వాహకులు ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. నిర్వాహకులు విద్యుత్ సౌకర్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రాత్రిపూట మండపాల వద్ద కాపలా ఉండి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. పోలీసులు ప్రజల భద్రత, రక్షణ, బాధితులకు న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ అధికారులు పనిచేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా కల్పించాలనీ సిబ్బందికి ఆయన సూచించారు. తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు వివరాలు, వారు పై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితులు, వారి కదలికల గురించి, అనుమానితులు, కేడీ, డీసీల వివరాలు అడిగి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి ఆయన సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేయాలని ప్రమాదాలు ఎక్కవ జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి పోలీసు అధికారులు రెవెన్యూ రవాణ, నేషనల్ హైవే అథారిటీ, గ్రామ పంచాయతీ, రోడ్డు భవన్ ల శాఖ వారి సమన్వయంతో ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. దినదినాభివృద్ధి చెందుతున్న ధర్మారం ప్రాంత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నేరాలు, వాటిపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలనే పలు సూచనలు ఎస్సైకి సూచించారు. ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఎవరి వైపు న్యాయం ఉంటుందో పోలీసు శాఖ అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ జీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.