MRPS | జగిత్యాల, అక్టోబర్ 28 : ఉద్యమ పోరాటాల వలనే ఎస్సీ వర్గీకరణ సాధించామని కోర్టు కు హాజరైన ఎమ్మార్పీఎస్ నేతలు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థాన కోర్టు కు ఎమ్మార్పీఎస్ నేతలు మంగళవారం హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన సందర్భంగా జాతీయ రహదారి దిగ్బంధం చేయడంలో భాగంగా 2022 ఆగస్టు 3 న కరీంనగర్ ప్రధాన రహదారి మల్యాల ఎక్స్ రోడ్ వద్ద దిబ్బంధం చేశారు.
మల్యాల పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఏ.2గా నక్క సతీష్, ఏ3 గా సురుగు శ్రీనివాస్, ఏ4 గా బొల్లె అనిల్ పై కేసు నమోదయ్యాయి. ఎమ్మార్పీఎస్ నాయకుల తరుపున న్యాయవాది బిరుదుల లక్ష్మణ్ తో జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘకాలం పోరాడి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని, న్యాయబద్ధమైన మా పోరాటాన్ని వంచి వేయడానికి మాపై కేసులు పెట్టి ఉద్యమాన్ని ఆపే విధంగా ప్రయత్నించారని తెలిపారు. వెంటనే ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.