NandiReservoir | ధర్మారం, జనవరి 25 : కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు అనుబంధంగా ఉన్న ఎగువ ప్రాంతాల్లో సాగు చేసిన యాసంగి పంటలకు సాగునీటిని అందించే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో నారాయణపూర్ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో సాగు చేసిన యాసంగి పంటలకు సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు.
అయితే నారాయణపూర్ రిజర్వాయర్ కు ఎల్లంపల్లి ప్రాజెక్టు కు అనుబంధంగా ఉన్న వేంనూరు ఎల్లంపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నంది రిజర్వాయర్ లోకి నీటిని నంది రిజర్వాయర్ కు పంపింగ్ చేసి ఇక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు పైప్ లైన్ ద్వారా ఎత్తి పోయాల్సి ఉండేది. కానీ మొదట నంది రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని తరలించాలని అధికారులు నిశ్చయించారు. అయితే ఈనెల 8, 9,10 తేదీలలో వరద కాలువ కింద సాగు చేసిన పంటల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని నంది రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నంది రిజర్వాయర్ లో ప్రస్తుత నీటిమట్టం 228.65 మీటర్ల వరకు నీరు నిల్వ ఉండడంతో నారాయణపూర్ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో సాగు చేసిన యాసంగి పంటలకు సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల నిర్ణయించారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం 12.20 గంటల నుంచి నంది రిజర్వాయర్ కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి పంప్ హౌస్ లో ఒక మోటర్ ను అధికారులు ఆన్ చేశారు. దీంతో కుడి వైపు పైపులైన్ ద్వారా 247 క్యూసెక్కుల చొప్పున నీరు నంది రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ కు పంపింగ్ చేస్తున్నారు.
నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి ఎగువ ప్రాంతంలో ఉన్న కొడిమ్యాల, పోతారం, రుద్రంగి మండలాలకు సాగునీటి సరఫరా కానుంది. కాగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 28 నుంచి ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా నంది రిజర్వాయర్ లోకి పంపింగ్ చేసే ప్రక్రియను చేపట్టి యాసంగి పంటలు ముగిసేదాకా మార్చి నెలాఖరు వరకు నీటిని తరలిస్తామని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.