ఏడాదిన్నర కిందటి జలవనరులతో కళకళలాడిన సిరిసిల్ల గడ్డ ఇప్పుడు తల్లడిల్లుతున్నది. రోజురోజుకూ తీవ్రమవుతున్న సాగునీటి కష్టాలతో అల్లాడిపోతున్నది. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ఎత్తిపోతలతో మండువేసవిలోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు.. నిండుకుండలా మారిన మధ్య, ఎగువ మానేరు జలాశయాలు.. నేడు వెలవెలబోతున్నాయి. మొన్నటిదాకా ఎటుచూసినా పుష్కలమైన జలాలతో సస్యశ్యామలమైన భూములు బీటలు వారుతున్నాయి. భూగర్భజలాలు ఏకంగా 6 మీటర్లకు చేరి ఒకనాడు ఐఏఎస్‌లకే పాఠ్యాంశమైనా.. ఇప్పుడు అదే భూగర్భజలాలు పాతాళానికి చేరి కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో సేద్యం తలకిందులు అవుతుండగా, అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల ప్రాంతానికి నాడు రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎగువమానేరు ప్రాజెక్టు ఒక్కటే ఉండేది. వానకాలం వరద నీరు ఆధారంగా నిండేది. మెట్ట ప్రాంతం కావడంతో సాగు అధ్వానంగా ఉండేది. రైతుల బాధలు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, అప్పటి మంత్రి కేటీఆర్ సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
రాజరాజేశ్వర, అన్నపూర్ణ, మల్కపేట రిజర్వాయర్లను పూర్తి చేసి, సిరిసిల్లను వాటర్ హబ్‌లా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలతో రాజరాజేశ్వర జలాశయాన్ని కాళేశ్వరం ఎత్తిపోతలకు గుండెకాయలా మార్చారు. ఇక్కడి నుంచి ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ ప్రాజెక్టు.. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌కు నీటిని పంపించారు. అయితే, మల్లన్నసాగర్ నుంచి నీటిని వదిలి కూడెల్లి వాగు ద్వారా ముస్తాబాద్ మండలంలోని చెరువులతోపాటు గంభీరావుపేట మండలంలోని ఎగువమానేరు ప్రాజెక్టును నింపారు.
మండుటెండల్లోనూ కాళేశ్వరం జలాలతో మానేరు వాగులు, చెరువులు మత్తళ్లు దూకించారు. ఒకప్పుడు 900 ఫీట్ల బోరు వేసినా నీళ్లు రాని బోర్ల నుంచి ఉబికివస్తున్న గంగమ్మను చూసి అన్నదాతలు మురిసిపోయారు. ఎటుచూసినా పుష్కలమైన జలాలతో రైతులు పుట్లకొద్దీ వడ్లు పండించారు. 2023లో భూగర్భ జలాలు ఒక్కసారిగా 6.38 మీటర్ల పైకి రాగా, ఈ అంశం ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగానూ మారింది. అలా సిరిసిల్ల పుష్కలమైన జలరాశులతో అలరారింది.
కేటీఆర్ చొరవతో సజీవ జలదృశ్యం
మెట్టప్రాంతమైన సిరిసిల్ల నియోజకవర్గంలో అప్పటి మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో మెట్ట ప్రాంతానికి జలకళ వచ్చింది. ఇచ్చిన మాట మేరకు మల్లన్నసాగర్ పరిధిలోని తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా వెళ్తున్న నీటిని గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి వదిలారు. ఈ నీటితో గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో పలు చెక్‌డ్యాంలు, చెరువులు నింపారు. అక్కడి నుంచి ఇదే వాగు ద్వారా ఎగువమానేరు ప్రాజెక్ట్‌కు తరలించారు. నట్టెండకాలంలోనూ మత్తడి దుంకించి దిగువన చెక్‌డ్యాంలను నింపారు. అంతే కాకుండా, సిరిసిల్ల నియోజకవర్గంలోని చెరువులను నింపడంతో సజీవ జలదృశ్యం ఆవిష్కృతమైంది.
దశాబ్దం కిందటి వరకు ఎండకాలం రాకముందే సిరిసిల్ల చెరువులు, కుంటల్లో చుక్కనీరుండేది కాదు.. మెట్టప్రాంతంగా ముద్రపడ్డ సిరిసిల్లలో వందల ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు పడేవి కాదు.. రైతులు ఎవుసం సాగక అప్పుల పాలై ఉపాధి లేక ఉన్న ఊరును, కుటుంబాలను విడిచి దుబాయి, బొంబాయిలకు వలసబాట పట్టాల్సిన పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చొరవ, అప్పటి మంత్రి కేటీఆర్ కృషితో సిరిసిల్ల మారిపోయింది. వ్యవసాయం పండుగలా మారింది. 60 వేల ఎకరాల సాగు మూడింతలకు పెరిగి ధాన్యం సిరులు కురిపించింది. కానీ, నేడు సాగునీరు లేక.. ప్రభుత్వం ప్రోత్సాహం లేక.. వ్యవసాయం భారంగా మారుతున్నది.
నేడు బోసిపోయిన ప్రాజెక్టులు
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోయాయి. వాగులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోగా, చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. వరిని కాపాడుకునేందుకు అప్పులు చేసి బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యమే ఈ కరువుకు కారణమని, మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపకపోవడంతోనే భూగర్భజలాలు అడుగంటిపోయాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యమానేరులో 23టీఎంసీలు నిల్వ చేస్తే, కాంగ్రెస్ సర్కారు 9.85టీఎంసీలను మాత్రమే నిల్వ చేసింది. ఇంకా కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవడం, మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేసి ఎగువమానేరు, చెరువులను నింపకపోవడంమే కరువుకు కారణమని రైతులు మండిపడుతున్నారు.
సిరిసిల్ల దశాబ్దం కిందటి వరకు మెట్ట ప్రాంతం.. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడ్డ ప్రాంతం.. సాగునీటికే కాదు, తాగునీటికి తండ్లాడిన ప్రాంతం. ఎటుచూసినా ఎడారిని తలపించిన ప్రాంతం.. కానీ స్వరాష్ట్రంలో అపరభగీరథుడు కేసీఆర్ కృషితో గోదావరి పరవళ్లు తొక్కుతూ మానేరు ఒడికి చేరింది. ఎగువ మానేరును నింపింది. సాగునీటి గోస తీరి సస్యశ్యామలంగా మారిపోయింది. ఏడాదిన్నరలో మళ్లీ పదేళ్ల కిందటి దుర్భిక్ష పరిస్థితులు ఉత్పన్నమవుతుండగా, జిల్లా తల్లడిల్లుతున్నది.
పదేళ్లలో గింత గోసపడలే
పదేండ్ల కేసీఆర్ పాలనలో సాగునీళ్లకు తండ్లాడలేదు. రైతు బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి మాగోస తెలిసి నోడాయే. సిరిసిల్ల మానేరువాగులో గంగమ్మ గుడి దాక నీళ్లు నింపిండు. ఎండకాలంలో బోరు చాలు చెయ్యంగనే నీళ్లు పైకి వచ్చేవి. మాఒక్క బోరు అయిదెకరాలు పారింది. పోయినేడు మంచిగున్నయని ఈయేడు యాసంగిలో సాగు చేసిన. వాగులో నీళ్లు గుంజేసిన్రు. బోర్లన్నీ ఇంకి పోయినయ్. నీళ్లు లేక ఈనిన వరి ఎండిపోతుంటే సూడలేక వాటర్ ట్యాంకులు తెచ్చి పోత్తున్న. ఒక్కో ట్యాంకర్‌కు 800, రోజుకు పది ట్యాంకర్లు పెట్టిపారిత్తున్న. ఇప్పటికే నీళ్లకు 80వేలు పెట్టిన. సారు పోయినంక ఇంత కష్టమొచ్చింది. సారు వత్తనే మళ్లనీళ్లు సూత్తం.
– హనుమయ్య, రైతు (తాడూరు)
పెట్టబడి ఎల్తదన్న నమ్మకం లేదు
అప్పుడు కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరంతో మాఊరిలోని చెర్లు, కుంటల్లో నీళ్లు బర్పూర్ ఉండె. పదేళ్ల కాలంలో యాసంగిలో అలుగులు దూకినయి. నాకున్న అయిదెకరాల్లో ఏసిన వరితో 80 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ యాసంగిలో నీళ్లకు బాగా తిప్పలు పడ్డం. చెర్లు, కుంటల్లో నీళ్లులేవు. బోర్లన్నీ దగ్గరపడ్డయి. మడులు తడవలే. ఆశించిన దిగుబడి వత్తదో రాదోనన్న రందే. పెట్టబడి ఎల్తదన్న నమ్మకం లేదు. రంగనాయక సాగర్ నుంచి మావూరికి కాలువ తీత్తమన్నరు. ఏడాదిన్నర గడిసింది. ఇంకా జాడేలేదు. కాలువ అత్తనే మా పొలాలు పచ్చగుంటయి.
– పలుమాల రవి, రైతు (రామోజీపేట)