కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొంత మంది నాయకులు వలసలను ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులు అస్త్రం ప్రయోగిస్తున్నారు. నిరాధారమైన ఫిర్యాదులతో భయకంపితులను చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రాపుపల్లెలో సోమవారం జరిగిన ఘటనే దీనికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుండగా, ఈ వ్యవహారంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేములవాడ : రాజకీయ పార్టీలో మార్పులు, చేర్పులు, చేరికలు వంటివి సహజంగా జరుగుతాయి. అందులో భాగంగానే ఈనెల 16న బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ బూరుగుల నందయ్య, యూత్ అధ్యక్షుడు కట్ట గోవర్ధన్ ఆధ్వర్యంలో.. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో పలువురు యువకులు.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇదంతా బహిరంగంగానే జరిగింది. ఇదే విషయాన్ని సదరు నాయకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వైరల్‌గా మారింది. పల్లె నుంచే చేరికల ప్రస్థా నం మొదలైందని, మున్ముందు మరిన్ని వలసలు పెరుగుతాయన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.
మింగుడు పడని కాంగ్రెస్
చేరికల విషయం సోషల్‌మీడియాలో ప్రచారం కావడంతో తట్టుకోలేని కొంత మంది నాయకులు.. బీఆర్ఎస్లో చేరిన పలువురిని తిరిగి కాంగ్రెస్‌లో కలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఒక అడుగు ముందుకేసి ఆశ పెట్టినట్టు కూడా తెలుస్తున్నది. అయినా ఏ ఒక్కరూ కూడా తిరిగి హస్తం పార్టీకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో పరిస్థితి చేజారుతుందని భావించిన కొంత మంది కాంగ్రెస్ నాయకులు.. ఈ వలసలకు అడ్డుకట్ట వేయాలని భావించి పోలీసుల అస్ర్తాన్ని ప్రయోగించారన్న విమర్శలు వస్తున్నాయి. వెంకట్రావుపల్లెలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారి సంఖ్య ఎక్కువగా చూపుతూ.. అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ కొంత మంది హస్తం నాయకులు సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Karimnagar1
బలవంతంగా స్టేషన్‌కు
నిజానికి ఫిర్యాదు తీవ్రతతో కూడుకున్న సమస్య కాదు కానీ, పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఫిర్యాదు రావడమే ఆలస్యం అన్నట్టు అత్యుత్సాహం చూపారన్న విమర్శలు వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాజీ సర్పంచ్ నందయ్య ఇంటికి ముందుగా కానిస్టేబుల్‌ను పంపించారు. స్టేషన్‌కు రావాలని చెప్పగా.. 25 రోజుల క్రితమే తన తొంటికి శస్త్ర చికిత్స జరిగిందని, తాను నడువలేని స్థితిలో ఉన్నానని నందయ్య సదరు కానిస్టేబుల్‌కు వివరించగా, ప్రత్యక్షంగా పరిస్థితిని చూసిన ఆ కానిస్టేబుల్ ఈ సమాచారాన్ని ఎస్ఐకి వివరించారు. అయినా వినకుండా ఏకంగా పోలీస్ వాహనాన్ని పంపించి.. జబర్దస్త్‌గా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘మా ఆయన ఏం తప్పుచేశారో చెప్పి తీసుకెళ్లండి’ అంటూ నందయ్య సతీమణి ప్రశ్నిస్తే.. ‘మాకేమి తెలియదు. ఫిర్యాదు వచ్చింది తీసుకెళ్తున్నాం’ అని పోలీసులు చెప్పారు.
ఈ సమయంలో నందయ్య కొడుకు ఫోన్లో చిత్రీకరిస్తుండగా అడ్డుపడ్డారు. చివరికి కుటుంబ సభ్యులను బెదిరించి.. నందయ్యను బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్లోనూ పోలీసులకు-నందయ్యకు కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తున్నది. ముందుగా తనను పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని ప్రశ్నించాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఫిర్యాదు వచ్చిందని, ఆధార్‌కార్డు ఇస్తే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెప్పారని, దీనిని వ్యతిరేకించినట్టు నందయ్య ‘నమస్తే’కు తెలిపాడు. అవసరమైతే రేపు సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాను తప్ప ఆధార్ కార్డు ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసినట్టు చెప్పాడు. ఇదే సమయంలో హస్తం గూటిని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన మరికొంత మందికి కూడా పోలీసులు ఫోన్లు చేసి స్టేషన్‌కు రమ్మని బెదిరించినట్టు విమర్శలు వస్తున్నాయి.
పునరావృతమైతే ఆందోళన చేస్తాం: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని, అక్కడి అధికారులతో మాట్లాడారు. పార్టీలు మారినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తాము ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు అందరనీ సమానంగా చూడాల్సింది పోయి కాంగ్రెస్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా కనీస మానవీయత లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు.
ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. మరోసారి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తే సహించేంది లేదన్నారు. అనంతరం ఆయన తన వాహనంలో నందయ్యను ఇంటి వద్ద దింపారు. సుంకె వెంట బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, రవి, కమల్ గౌడ్, సాగర్, అనిల్ మధు తదితరులు ఉన్నారు. అయితే ఈ విషయమై ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్నును ‘నమస్తే’ వివరణ కోరగా, సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెడుతున్నట్టు ఫిర్యాదు వచ్చినందునే పిలిచి విచారించామని తెలిపారు.