కాంగ్రెస్-బీజేపీ మధ్య ఒక్కసారిగా చిచ్చు రేగింది. మాటలు హద్దులు దాటి దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి సోమవారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య గొడవకు కారణం కాగా, మంగళవారం చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల బండి దిష్టిబొమ్మలను దహనం చేయగా.. సంజయ్ మంగళవారం కూడా పొన్నంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై మంత్రి పొన్నం స్పందించి బండికి కౌంటర్ చేస్తూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. మొత్తంగా ఈ రాజకీయ పరిణామాలు రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేపట్టారు. ఇప్పటికే మొదటి విడుత పూర్తి చేసి, సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కోహెడ మండలం నుంచి రెండో విడుత యాత్రను ప్రారంభించారు. మొదటి రోజు కోహెడ బహిరంగసభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పేరు ప్రస్తావించకుండానే తీవ్రంగా విమర్శించారు. ‘రాముడు అక్కడే పుట్టిండని గ్యారంటీ ఏంటని పొన్నం ప్రశ్నిస్తున్నారని, అలాగే విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వచ్చిన అక్షింతలను సైతం అవహేళన చేశారని సంజయ్ మండిపడ్డారు. ‘రాముడు అయోధ్యలోనే పుట్టాడని అడుగుతున్నడు కదా.. అందుకు నేను ఏమన్నానంటే.. మీరు మీ అమ్మకు పుట్టారని గ్యారెంటీ ఏంటి? అన్నా ను’ అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల ప్రజాహిత యా త్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో సంజయ్ మంగళవారం ప్రజాహిత యాత్రలో భాగంగా మరోసారి ఫైర్ అయ్యారు. తన యాత్రకు పొన్నం ప్రభాకర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూనే.. ఆయనకు సవాల్ విసిరారు.
‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఏం చేశానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్న. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, మోదీ ఏం చేశారో చెబుతున్న. రాము డు అయోధ్యలో పుట్టాడనడానికి ఆధారాలేంటని కించపర్చే వారిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్తున్న. మీకు దమ్ముంటే.. ఇదే మీ విధానాలు, మీ నినాదాలతో ఎన్నికల్లోకి రండి. కరీంనగర్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంట. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నీవు మంత్రి పదవికి రాజీనామా చేస్తవా..? రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటవా..?’ అని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతగాక కాంగ్రె స్ మూకలను పంపి ప్రశాంతంగా సాగుతున్న యాత్ర లో విధ్వంసం సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నంను హెచ్చరించారు. ‘ఇక్కడున్న మంత్రి ప్రతీసారి హల్చల్ చేయాలని చూస్తున్నడు. ప్రతిదాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నడు. నాకో డౌటొస్తున్నది. గతంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిండు. ఇప్పుడు సీఎంగా ఉన్నందున ప్రజలను రెచ్చగొడుతూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేస్తున్నడేమోనని అనుమానంగా ఉన్నది. రేవంతన్నా జాగ్రత్తగా ఉండు’ అని సూచించారు. ‘రాముడు అయోధ్యలోనే పుట్టారని చరిత్ర చెబుతున్నది. సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
అయినా ఆధారాలు ఏంటని వితండవాదం చేస్తున్న వాళ్లను నేనడుగుతున్న. మీరు మీ అమ్మకే పుట్టారనడానికి ఆధారాలేంది? అట్లాగే నేను కూడా మా అమ్మకే పుట్టాననడానికి ఆధారాలేంది? అక్కడున్న నర్స్, డాక్టర్లు చెబితేనే కదా తెలిసేది? నేను నిన్న కూడా అదే చెప్పిన. అందులో తప్పేమున్నది? బరాబర్ మళ్లీ అంట’ అని సంజయ్ స్పష్టం చేశారు. కానీ, సాయం త్రం వరకు మరో ప్రకటన చేశారు. ‘పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్న. అమ్మా.. నేను నిన్ను కించపరిచేలా ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నడు. మీ పేరును రాజకీయంగా వాడుకుంటూ మానసిక క్షోభకు గురి చేస్తున్నడు’ అని చెప్పుకొచ్చారు. ఇటు సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేసి, బండి అప్పుడే రాజకీయ డ్రా మాలు మొదలు పెట్టారంటూ ఘాటుగా విమర్శించా రు. ఎంపీగా గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏమి చేశావో చెప్పాలని నేను రాజకీయంగా ప్రశ్నిస్తుంటే.. ఆయన మాత్రం నా తల్లి గురించి మాట్లాడుతున్నడు’ అంటూ మండిపడ్డారు. రాముడి గురించి చెప్పడమే కాదు, వారికి ఉన్న సంస్కారం వీరికి ఉండాలి కదా? అని ప్రశ్నించారు. బండి యాత్రను ఎవరూ అడ్డుకోవడం లేదని, కావాలనే ప్రాపగండ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
బండి అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. సోమవారం రాత్రే నిరసనలు తెలిపారు. మంగళవారం పలుచోట్ల సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. చిగురుమామిడి బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి, ఎంపీకి వ్యతిరేకంగా నినదించారు. అంతకుముందు ఉల్లంపల్లి, హుస్నాబాద్ రహదారి మధ్య ఆందోళన చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. కరీంనగర్లో దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ చిగురుమామిడి, హుజూరాబాద్, హుస్నాబా ద్ ఠాణాల్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల తీరుపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు.
ఉద్రిక్తతల నడుమ యాత్ర
బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, హుస్నాబాద్ మండలం రాములపల్లిలో ఘర్షణ వాతావరణం కనిపించింది. సోమవారం రాత్రి బొమ్మనపల్లిలో సంజయ్ బస చేసిన క్యాంపును ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయాన్నే తరలివచ్చారు. అకడే ఉన్న బీజేపీ నాయకులు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. అలాగే విషయం తెలిసి క్యాంపునకు వెళ్తున్న బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత పోలీసుల అనుమతితో యాత్ర ముందుకు సాగగా, రాములపల్లిలో కాంగ్రెస్ నాయకులు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎలాంటి అవాంతరాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
నీవు మీ అమ్మకు పుట్టావని గ్యారెంటీ ఏంటి?
– పొన్నంపై సంజయ్ తీవ్ర విమర్శలు
బండి సంజయ్ కోహెడలో జరిగిన సభలో రాముడి గురించి ప్రస్తావిస్తూనే పరోక్షంగా పొన్నంపై విరుచుకుపడ్డారు. ‘రామాలయం గురించి ఇక్కడి వ్యక్తి కామెంట్ చేస్తున్నడు. రాముడికి సంబంధించి అక్షింతలు వస్తే అవి అక్షింతలు కావు రేషన్ బియ్యమని మాట్లాడుతున్నడు. అక్షింతల్లో ఎవడైనా రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరాం బియ్యం అని చూస్తడా..? అలాగే, రాముడు అక్కడే పుట్టిండని గ్యారెంటీ ఏంటని అడుగుతున్నడు. అందుకే మీరు మీ అమ్మకు పుట్టావని గ్యారెంటీ ఏంటి? అని నేనన్న. బిడ్డ పుట్టిన తర్వాత నర్సమ్మ చెబితేనే కదా తెలిసేది. రాముడు అక్కడే పుట్టాడని చెప్పడానికి చరిత్రే అధారం. రామాలయం కడితే కూడా వీళ్లకు కడుపు మండుతున్నది. మా రాముడి జన్మస్థలాన్ని, పుట్టుకను ప్రశ్నించే వాళ్లను చెప్పుతో కొట్టాలి’ అంటూ పరోక్షంగా పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘కొత్తగా మంత్రి అయినవని ఊరుకుంటున్న. మనోడే కదా? అని భరిస్తున్న. కానీ, మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే ఊరుకుంటమా? మా రాముడిని, దేవుడిని కించపరిస్తే మేం భరించాలా’ అంటూ ప్రశ్నించారు. ‘రాముడిని, అయోధ్య అక్షింతలను కించపర్చినందుకు జనం మిమ్మల్ని ఛీత్కరించుకుంటున్నరు. అయినా మీరు మారకపోతే తగిన బుద్ధి చెబుతరు’ అని హితవు పలికారు.
సమాజం ఆలోచించాలి
– బండి వ్యాఖ్యలపై పొన్నం ఫైర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా విమర్శించారు. ‘ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని బండిని నేను ప్రశ్నించిన. ఐదేళ్ల ఎంపీ పదవీ కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశావో చెప్పి ప్రచారం చేయాలని డిమాండ్ చేసిన. శ్రీరాముడి పేరిట ఓట్లు అడగడం కాదు, చేసిన అభివృద్ధి ఏంటని అడిగిన. ఆయన మాత్రం నా తల్లి, నా జన్మకు సంబంధించిన మాటలు మాట్లాడిండు’ అంటూ మండిపడ్డారు. ‘జన్మనిచ్చిన తల్లి. అది నా తల్లి కావచ్చు లేదా ఇంకొకరి తల్లి కావచ్చు. కానీ, నేను అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఆయన మాత్రం నా తల్లి, నా జన్మకు సంబంధించి మాట్లాడిండు. ఇది ఎంతవరకు సమంజసం? సభ్య సమాజం ఆలోచించాలి’ అని కోరారు. ఆయన యాత్రను, ప్రచారాన్ని ఎవరో అడ్డుకుంటున్నట్టు రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నదని, తామెవ్వరం అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘మీరు మాట్లాడిన మాటలపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అంటున్నరు. ప్రజలే మనకు చట్టం. ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతున్న. ఈ ప్రజాస్వామ్యం సాక్షిగా అడుగుతున్న. ప్రతి బిడ్డకూ జన్మనిచ్చేది ఓ తల్లే. నా తల్లి, నా జన్మ గురించి మాట్లాడుతున్న సంజయ్‌పై ఆలోచన చేయండి’ అని కోరారు. ‘భార్యకు మంగళసూత్రం కడుతరు. అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి నా తల్లి గురించి, నా జన్మ గురించి మాట్లాడడం ఏం రాజకీయం?’ అని ప్రశ్నించారు.
‘బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకులు ఆలోచించాలి. మీరు ఈ నాయకుడి మాటలను సమర్థిస్తున్నారా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఈ జిల్లాకు సంబంధించి ఇతర బీజేపీ నాయకులను అడుగుతున్న. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లలో మీరేం చేశారు? నేను ఎంపీగా ఉన్నప్పుడు నేనేం చేశాను? అన్నదానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఏడాదికాలంగా అడుగుతున్న. కానీ, సంజయ్ నియోజకవర్గంలో ఏం చేయలేదని, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతాననే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నడు’ అని మండిపడ్డారు. ‘గత ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్ల అన్న మాటలను నీ గెలుపునకు ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నావో అందరికీ తెలిసిందే. ఈరోజు నీవు మాట్లాడిన తల్లి మాట నీ రాజకీయ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్. జాగ్రత్త’ అని హితవు పలికారు. ‘మేం హింసావాదులం కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్లం. మేం నీ యాత్రకి అడ్డుపడతలేం. శవం మీద పేలాలు ఏరుకునే రకంగా యాత్రను అడ్డుకుంటున్నారని చెబుతూ రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో.. ఇంకా ఏమైనా చేసుకో.. కానీ, నాలుక ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు సంజయ్’ అని హెచ్చరించారు.