Huzurabad ACP | హుజూరాబాద్ టౌన్, మే 30 : స్వచ్ఛంద సంస్థలు ప్రజాహితమే పరమావధిగా పనిచేయాలని హుజూరాబాద్ ఏసీపీ వీ మాధవి సూచించారు. పీవీ సేవా సమితి ప్రతినిధులతో పాటు సిద్దార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షుడు సాగి వీర భద్ర రావు పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మాధవిని శుక్రవారం కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలంటే, అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో అవసరమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు వారధిగా పని చేయాలని, దేశ అభివృద్ధిలో వాటి పాత్ర ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి అధ్యక్షులు తూము వెంకట రెడ్డి, సిద్దార్థనగర్ కాలనీ అధ్యక్షుడు సాగి వీర భద్ర రావు, పీవీ సేవాసమితి సభ్యులు మనోజ్, విశ్రాంత పీడీ రాజి రెడ్డి, మురికి గౌరీశంకర్, సంపత్ రావు, శ్రీనివాస్ రావు, కన్నయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.