Irrigation | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారు నర్మాల మానేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కుడి కాలువ ద్వారా నీరందిదించాలని రైతులు శుక్రవారం వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. జూలై మాసంలో వర్షాలతో సంబంధం లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు కాలువలు గలగల పారుతూ ఆయకట్టు భూములకు సాగునీరు అందించేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు కాలేశ్వరం నుండి నీళ్లు తీసుకువచ్చి ఎత్తిపోయకపోవడంతో జూలై మాసంలో కాలువలు ఎండిపోవడంతో అందులో వాలీబాల్ ఆడుతూ రైతులు నిరసన తెలిపారు.
గతంలో మాదిరిగా వర్షాలతో సంబంధం లేకుండా కాలేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీళ్లు తీసుకువచ్చి మా ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కిష్టయ్య, అంజయ్య, దయాకర్ రావు, రాజు, మల్లేశం, సుమన్, రాజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.