Green India Challenge | కోల్ సిటీ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరు, ప్రతీ గుడిలో నాటాలన్నదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్దేశమనీ, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ మహాయజ్ఞంకు శ్రీకారం చుట్టారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈమేరకు దసరా పండుగ పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ నుంచి జమ్మి మొక్కను స్వీకరించిన ఆయన శుక్రవారం గోదావరిఖని జవహర్ నగర్ లో గల హనుమాన్ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జమ్మి చెట్టుకు పూజ చేసి అనంతరం నాటి ఛాలెంజ్ ను స్వీకరించారు.
జమ్మి చెట్టు వద్ద సెల్ఫీ దిగి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా తెలంగాణ ప్రజలు పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ వృక్షంగా అప్పటి ప్రభుత్వం గుర్తించిందనీ, ప్రకృతి వైపరిత్యాల వల్ల అంతరించిపోతున్న జమ్మి చెట్టును, దాని విశిష్టతను గుర్తించిన మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో జమ్మి చెట్టు ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ కు శ్రీకారం చుట్టారని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏటా దసరా పండుగకు ముందు ఊరిలో, గుడిలో ఈ జమ్మి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు బాధ్యతగా తీసుకొని నియోజక వర్గ వ్యాప్తంగా ప్రతి గుడిలో జమ్మి చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్నకు యూరియా అందివ్వడానికే దిక్కు లేదనీ, ఇక జమ్మి చెట్టు ఆలోచన ఎక్కడ నుంచి వస్తుందన్నారు. దసరా రోజున తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జమ్మి చెట్టును పూజించి ఆకులను తమ బంధువులకు ఒకరికొకరు వాయినంగా పుచ్చుకొని ఆశీర్వదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందనీ, ఆ జమ్మి కొరత ఉండొద్దనే ఉద్దేశంతోనే సంతోష్ కుమార్ లక్ష్యం నెరవేర్చడం కోసం ఈ మహాయజ్ఞంలో తాను భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన హయాంలో రామగుండం నియోజక వర్గంలో నాడు దసరాకు ముందు 500 జమ్మీ మొక్కలు నాటిన సందర్భంను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జేవీ రాజు, మారుతి, కోడి రామకృష్ణ, సత్తు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, అరవింద్, కర్రావుల రామరాజు, లంకదాసరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.