కోల్‌సిటీ, జూన్ 28: ప్రతిభ, కష్టపడి పనిచేసే శక్తి ఉన్నా.. తగిన ప్రోత్సాహం లేక ఇంటికే పరిమితమవుతున్న మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది విజయమ్మ ఫౌండేషన్. ఔత్సాహికులైన వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తున్నది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథ్యాన ఏర్పాటైన ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెదురుతో గృహోపకరణాల తయారీపై ఈనెల 15 నుంచి గోదావరిఖనిలో శిక్షణ అందిస్తున్నది. మహారాష్ట్ర నుంచి వచ్చిన నిపుణులు వసంత, అన్నపూర్ణ, కేసరితో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కార్పొరేట్ సంస్థ సారా బహుద్దేశియా సంస్థ, బాంబూటెక్ గ్రీన్ సర్వీస్‌ల సహకారం తీసుకుంటున్నారు. అందులో పెన్‌స్టాండ్స్, ట్రేలు, ఫ్లాగ్స్, మొబైల్ స్టాండ్స్, ల్యాంప్ స్టాండ్స్, రాఖీలు, డైరీలు, పెన్స్, ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజెస్, మల్టీపుల్ పెన్ స్టాండ్స్, బ్రష్ హోల్డర్ బాక్స్, బుక్ స్టాండ్, ఆల్బమ్స్ తదితర వాటిని తయారు చేయడంలో తర్ఫీదు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మహిళలు, యువతులు ఆసక్తిగా శిక్షణ పొందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆకలితో ఇబ్బంది పడవద్దని ఉద్దేశంతో ఎమ్మెల్యే చందర్ వీరందరికీ ఉచిత మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారంతో శిక్షణ ముగియనుండగా, ఆ తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడంతోపాటు సొంతగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల నుంచి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, శిక్షణ కేంద్రంలో ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్, సిద్ధార్థ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు.
ఇంట్లో ఒక్కరే పని చేసి వారి సంపాదనతో కుటుంబాన్ని పోషించడం కష్టం. మహిళలు కూడా ఎంతోకొంత సంపాదిస్తే కుటుంబం సాఫీగా సాగుతుంది. అటువంటి అవకాశం ఎమ్మెల్యే చందర్ సారు వల్ల దొరికింది. నేను కూడా శిక్షణ తీసుకుంటున్న. శిక్షణ తర్వాత సొంత యూనిట్ ఏర్పాటు చేసుకొని ఎంతోకొంత సంపాదిస్త. విజయమ్మ ఫౌండేషన్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేం.
– దివ్య, లెనిన్‌నగర్ (గోదావరిఖని)
విజయమ్మ ఫౌండేషన్ ద్వారా వెదురుతో గృహోపకరణాల తయారీపై శిక్షణ ఇస్తున్నారంటే గోలివాడ నుంచి వస్తున్న. ఇంకో వారం రోజుల్లో మా శిక్షణ ముగుస్తుంది. శిక్షణ కాలంలో ఎంతో శ్రద్ధగా తయారీలో మెళకువలు నేర్పిస్తున్నరు. పైగా మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించడం బాగుంది. శిక్షణను సద్వినియోగం చేసుకుంటా. ఎమ్మెల్యే చందర్ అంకుల్‌కు థ్యాంక్స్.
– కావ్య, గోలివాడ (అంతర్గాం మండలం)
నియోజకవర్గంలో ప్రతి మహిళా ఆర్థికాభివృద్ధి సాధించాలి. నా జీవిత భాగస్వామి విజయమ్మ కూడా ఎప్పుడూ మహిళల గురించే ఆలోచించేది. ఆమె ఆశయంలో భాగంగా ఏర్పడిన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే కుట్టు మిషన్, అల్లికలు, మగ్గం తదితర రంగంలో ఎంతోమందికి శిక్షణ ఇప్పించాం. సొంత యూనిట్ల ఏర్పాటుకు కూడా సహకారం అందిస్తున్నా. మహిళలు కూడా ఆత్మగౌరవంగా బతకాలంటే ఏదేని రంగంలో అడుగు పెట్టాలి. శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎవరి కాళ్లపై వారు నిలబడుతారన్న నమ్మకం ఉంది. నా వంతు సహకారం అన్ని వేళలా ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
వెదురు కళాకృతులకు మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నది. పైగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. మహిళలు తమ ఇంటి వద్దే తీరిక సమయంలో ఇలాంటి గృహోపకరణాలు తయారు చేయడం ప్రారంభిస్తే రాను రాను కార్పొరేట్ సంస్థల నుంచి ప్రాజెక్టులు కూడా పొందే అవకాశముంటుంది. తద్వారా చిన్న పరిశ్రమలు స్థాపించుకొని ఒక వ్యాపారంగా మరల్చుకొని స్థిరపడడమే గాకుండా మరికొంత మహిళలకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి రావొచ్చు.
– వసంత, శిక్షకురాలు (మహారాష్ట్ర)
వెదురుతో తయారు చేసే గృహోపకరణాలకు మంచి డిమాండ్ ఉంది. చిన్న చిన్న గృహోపకరణాలే గాకుండా గృహాలు, బేకరీలు, రెస్టారెంట్లు కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకొని మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న గృహోపకరణాలు తయారు చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థిరపడుతారు. స్థానిక ఎమ్మెల్యే ఒక ఫౌండేషన్ ద్వారా మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇంత సహకారం అందిస్తున్నారంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. ఇతర రాష్ర్టాల్లో ఇలాంటి సామాజిక దృక్పథం కలిగిన ప్రజాప్రతినిధులు చాలా అరుదుగా ఉంటారు.
– అన్నపూర్ణ, శిక్షకురాలు (మహారాష్ట్ర)