వేములవాడ టౌన్, సెప్టెంబర్ 3 : శ్రావణం మాసం సందర్భంగా భక్తులు వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి పోటెత్తారు. శుభ దినాలు ఎక్కువగా ఉన్న ఈ నెలలో శివున్ని ఆరాధిస్తే పుణ్యం సిద్ధిస్తుందని భావించి, క్యూ కట్టారు. మన జిల్లా, రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వెల్లువలా తరలివచ్చారు. ముఖ్యంగా ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాదిగా బారులు తీరారు. గంటల తరబడి మరీ లైన్లలో నిల్చొని రాజన్నను దర్శించుకున్నారు.
కోడె మొక్కులు చెల్లించుకుని, తలనీలాలు సమర్పించారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలంటూ వేడుకొన్నారు. మొత్తంగా నెల రోజుల్లో 4.50 లక్షల మందికిపైనే రాగా, రాజన్నకు మొత్తం 6,87,22,090 ఆదాయం సమకూరినట్టు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. అందులో అభిషేకం టికెట్ల ద్వారా 21,16,500, కల్యాణ టిక్కెట్ల ద్వారా 34,44,000 కేశఖండనం 1,2 కౌంటర్ల ద్వారా 15,22,700, కొబ్బరికాయలు, బెల్లం అమ్ముకునే లైసెన్సు ద్వారా 10,47,458, గండదీపం టికెట్ల ద్వారా 1,09,560, ధర్మశాలల కిరాయిల ద్వారా 43,80,497, ప్రత్యేక కోడెమొక్కు బడి టికెట్ల ద్వారా 1,74,76,600, లడ్డూ ప్రసాదాల ద్వారా 1,35,81,500, బ్రేక్ దర్శనం ద్వారా 12,33,000, శాశ్వత కల్యాణాల ద్వారా 1,40,000, శాశ్వత పూజల ద్వారా 1,69,362, బద్దిపోచమ్మ ఆలయ సేవల టికెట్ల ద్వారా 9,92,195, భీమేశ్వరాలయం సేవల టికెట్ల ద్వారా 3,06,720, సత్యనారాయణ వ్రత టికెట్ల ద్వారా 1,86,000తోపాటు ఇతర సేవల ద్వారా ఆదాయం సమకూరిందని వెల్లడించారు. శ్రావణమాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆలయానికి వచ్చిన భక్తులు సంతృప్తిగా స్వామివారిని దర్శించుకుని వెళ్లారని ఈవో తెలిపారు.