రుద్రంగి, మే 10 : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో అన్నదాతలు గోస పడుతున్నారు. పోయిన యాసంగి సీజన్లో యూరియా కోసం, పంటలు చేతికొచ్చే దశలో సాగునీటి కోసం తండ్లాడారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకుందామంటే అవస్థలు పడుతున్నారు. దీంతో ఆగ్రహిస్తూ రోడ్డెక్కుతున్నారు.
ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి దాదాపు అరగంటపాటు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. రుద్రంగి మీదు గా వెళ్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులువుతున్నా.. మాయిశ్చర్ వచ్చినా ఇప్పటివరకు తూకం వేయడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
ధర్నా విషయం తెలిసి తహసీల్దార్ పుష్పలత, ఎస్ఐ మోతిరామ్, డీఎస్వో బుచ్చిబా బు, డీఎంసీఎస్ నరసింహ అక్కడకు రాగా, ధాన్యం ఎప్పుడు కొంటారో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కలెక్టర్ రావాలంటూ నినదించారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పులూటి గణేశ్, దేగావాత్ తిరుపతి, దయ్యాల కమలాకర్, మంచె రాజేశం, కంటె రెడ్డి, నాగులపల్లి రవి, అల్లూరి గంగారెడ్డి, బోయిన చంద్రయ్య, కాదాస్ లక్ష్మణ్ కొడగంటి శ్యామ్, గంతే ప్రశాంత్, దయ్యాల నారాయణ, ఆకుల గంగాధర్ లావుడియా మోహన్, దయ్యాల పెద్దలు, ఇర్ణం రాజేశం, తర్రె గంగారెడ్డి, గడ్డం మహేందర్ ఉన్నారు.