వేములవాడ సర్కారు దవాఖాన కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న చర్యలు, కల్పించిన సౌకర్యాలతో అరుదైన సర్జరీలకు కేరాఫ్‌లా మారింది. లక్షల రూపాయల విలువైన మోకీలు మార్పిడి సర్జరీలను పూర్తి ఉచితంగా అందిస్తున్నది. ఇప్పటివరకు 25 మందికి శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయగా, పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థికభారం తప్పుతున్నది.
– వేములవాడ, డిసెంబర్ 7
వేములవాడ, డిసెంబర్ 7: వేములవాడలో 22.50కోట్లతో వంద పడకల ఏరియా దవాఖానను భవనాన్ని నిర్మించి, పేదలకు కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నారు. లక్షలాది రూపాయల విలువైన కీలకమైన చికిత్సను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. పదుల సంఖ్యలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేశారు. ప్రైవేట్‌కు మించి ప్రసవాలు కూడా చేస్తున్నారు. ఇంకా కంటి, దంత, ఇతర చికిత్సలను కూడా చేస్తున్నారు. ఈ దవాఖానకు నిత్యం 500 మందికి పైగా వస్తున్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్, పెరలాసిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కదల్లేని స్థితిలో ఏండ్లకేండ్లు మంచానపడ్డవారి కోసం ఇదే దవాఖానలో పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.
ఇప్పటిదాకా మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్స అంటే హైదరాబాద్ లాంటి కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే చేసేవారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వేములవాడ ఏరియా దవాఖానలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడి వైద్య బృందం ఆధ్వర్యంలో ఇప్పటివరకు 25 మందికి మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు పొందుతున్నారు. ఈ శస్త్ర చికిత్సల కోసం మరో 60 మంది రోగులు వెయిటింగ్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వేములవాడ దవాఖానలో ఇప్పటివరకు 25 మందికి మోకాలు కీలు మార్పిడి చేశాం. ఆపరేషన్లను విజయవంతంగా చేయడంతో రోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నారు. ఇంకా దవాఖానలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. మోకాలు కీలు మార్పిడి కోసం మరో 60 మంది దాకా ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.
– డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, సూపరింటెండెంట్ (వేములవాడ దవాఖాన)
నాకు ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు. పదేండ్ల నుంచి ఎడమకాలు మోకాలు నొప్పితో బాధపడుతున్న. కరీంనగర్, హైదరాబాద్ లాంటి నగరాల్లోని దవాఖానల్లో చూపిస్తే రూ.2 లక్షల దాకా ఖర్చయింది. ఇంకా ఖర్చయితయని చెప్పిన్రు. చేతిలో పైసలు లేక ఊరుకున్న. వేములవాడ దవాఖానల్లో ఆపరేషన్లు చేస్తున్నరని తెలిస్తే వచ్చి చేయించుకున్న. మునుపటి లెక్కనే నడుస్తున్న. చాలా సంతోషంగ ఉంది.
– ఆకుల భారతి, వేములవాడ