‘నేను ఈ గడ్డ బిడ్డనే. మాది మల్కపేట. ఇక్కడే పుట్టి పెరిగినోన్ని. ఈ ప్రాంతం గురించి, ఇక్కడి ప్రజల గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ప్రాంత పిల్లలు, యువతీ యువకులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నది నా లక్ష్యం. అందుకే విద్యా, వైద్య సేవలతో ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్న. మా అమ్మ జానకీదేవి పేరిట మా ఊరిలో 2 కోట్లతో ఆధునిక పాఠశాల కట్టించిన. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న. ఈ సేవలను నిరంతరం కొనసాగిస్త. ఆశతో కాదు, ప్రజలకు ఇంకా సేవ చేయాలనే ఆశయంతో వచ్చిన. ఎములాడ రాజన్న దయతో మీ ముందున్న.
నన్ను ఆశీర్వదించండి. మరింత అభివృద్ధి చేస్త’ అని వేములవాడ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజా స్పందన బాగున్నదని, తనను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ వరంలాంటిందనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదని, ప్రజలు తప్పకుండా దీవిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల మాటలు అంతా బూటకమని, వారంటీ లేని పార్టీ గ్యారంటీలను నమ్మవద్దని సూచించారు.
– రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఆశతో కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని వేములవాడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు విజ్ఞప్తి చేశారు. తన సొంతూరు మల్కపేటేనని, ఈ ప్రాంత పిల్లలు, యువత మంచి విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నది తన లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే విద్యా, వైద్య సేవలతో ప్రజల మధ్యనే ఉన్నానని, ఏములాడ రాజన్న దయతో మీసేవకుడిగా వస్తున్నానని చెప్పారు.
తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మె ల్యే చెన్నమనేని రమేశ్‌బాబు చాలా పనులు చేశారని, మిగిలిపోయినవన్నీ తాను పూర్తి చేస్తానని చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పడాన్ని ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రచార తీరుతెన్నులు.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను, తా ను గెలిపిస్తే చేయబోయే పనులను వివరించారు.
చల్మెడ లక్ష్మీనరసింహారావు : నాది ఈ గడ్డనే. మా సొంతూరు కోనరావుపేట మండలం మల్కపేట. ఇక్కడే పుట్టి పెరిగిన. తంగళ్లపల్లి మండలం చింతలఠాణా, కోరెం, రుద్రంగి, మానాలల్లో మా మేనత్తలున్నరు. మాఊరిలో వ్యవసాయం కూడ చేసిన. ఎప్పడు సెలవుదొరికినా మా కుటంబంతో కలిసి ఊరికొస్త. గ్రామస్తులందరితో కలిసి సరదాగా గడపడం, పల్లె వాతావరణమంటే నాకెంతో ఇష్టం. ఈ ప్రాంతం గురించి నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఇది నాడు వెనుకబడ్డ ప్రాంతం. తెలంగాణ వచ్చినంక అభివృద్ధి చెందుతున్నది. ఈ ప్రాంత పిల్లలు, యువతీ యువకులు మంచి విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నది నా ఆశయం. అందుకే విద్యా, వైద్య సేవలతో ప్రజల ఎప్పుడు ప్రజల మధ్యే ఉన్న.
చల్మెడ : నాకు రాజకీయాలు కొత్తకాదు. మా నాన్న చల్మెడ ఆనందరావు వృత్తి రీత్యా న్యాయవాది. 30ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఎన్నికైండు. 1989లో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. గతంలో కూడా నేను పోటీ చేసిన. ఇది కొట్లాట కాదు. ఆశతో కాదు, ఒక ఆశయంతో వచ్చిన. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా బరిలోకి దిగిన. ఇది నా సొంత నియోజకవర్గం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మన కండ్ల ముందే కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీల మాటలు అంతా బూటకం. వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తుందంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ల మాటల్ని నమ్మడం లేదు.
చల్మెడ: నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. నేను, మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కలిసి గ్రామగ్రామానికీ వెళ్తున్నాం. అన్ని గ్రామాల్లోనూ ప్రజల స్పందన బాగున్నది. ఏ ఊరికెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ సర్కారుపై విశ్వాసం చూపుతున్నారు. భవిష్యత్తుకు బాటలు వేసేది కేసీఆరేనని, మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటామని చెబుతున్నారు. మొన్న మంత్రి కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు, రోడ్‌షోలకు వేలాదిగా తరలివచ్చారు. నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని, సిరిసిల్ల నియోజకవర్గం తరహాలో అభివృద్ధి చేస్తానని మంత్రి ప్రకటించడాన్ని నియోజకవర్గ ప్రజలంతా స్వాగతించారు. ప్రజల స్పందనను చూస్తే నా గెలుపు ఖాయమని స్పష్టమవుతున్నది.
చల్మెడ: ఇప్పటికే మా ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు చాలా సమస్యలు పరిష్కరించిండు. మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్త. అక్కడక్కడ రోడ్లు ఇతర చిన్న చిన్న సమస్యలున్నయి. చాలా మందికి పింఛన్లు రావాల్సి ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్లు, వృద్ధాప్య, బీడీ పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్త. వేములవాడను మోడల్‌టౌన్‌గా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు పనిచేస్త. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాజన్న, బద్దిపోచమ్మ ఆలయాలను అభివృద్ధి చేస్త. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వీటీడీఏ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నయి. ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. యాదాద్రి ఆలయ పునర్నిర్మించడం దేశ చరిత్రలో సువర్ణధ్యాయం. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోని 32 ఎకరాల భూమి సేకరణ పూర్తయింది.
చల్మెడ: అసలు ముంపు గ్రామాలను సమస్యల్లోకి తోసిందే కాంగ్రెస్ పార్టీ. 2004లో మధ్యమానేరు ప్రాజెక్టు మొదలైనప్పుడు సర్వే ప్రకారం ఏయే గ్రామాలు మునిగి పోతాయో..? ఎంత భూమి మునిగి పోతుందో..? సర్వేలు తేల్చినయి. అధికారులు పూర్తి స్థాయిలో రిపోర్టు కూడా ఇచ్చిన్రు. 2004 నుంచి 2014వరకు కాంగ్రెస్ గవర్నమెంటే పవర్లో ఉన్నది. సమస్యను సమస్యగా పెంచుకుంటూ వచ్చిందే తప్ప పరిష్కరించ లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజల త్యాగాలను వెలకట్టలేమని చెప్పిండు. వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేసిండు. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రితో మాట్లాడి 18 ఏండ్లు నిండిన యువతకు సైతం పరిహారం ఇప్పించిండు. 95శాతం సమస్యలు పరిష్కారమైనయి. మిగిలిన 5శాతం చిన్నచిన్న సమస్యలున్నయి. వాటన్నింటినీ పరిష్కరిస్త.
నమస్తే : ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏం చేయబోతున్నారు?
అందాలన్నది నాసంకల్పం. ఆ లక్ష్యంతోనే మా ఊరు మల్కపేటలో మా తల్లి చల్మెడ జానకీ దేవి పేరిట 2 కోట్లతో ఆధునిక పాఠశాల కట్టించినం. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నం. ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పిస్త. మంత్రి కేటీఆర్‌తో కలిసి పరిశ్రమల ఏర్పాటుకు, యువత, మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రయత్నాలు చేస్త. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అప్పారెల్ పార్కుకు గార్మెంట్ పరిశ్రమలు తెప్పించిండు. గ్రీన్నిడిల్ కంపెనీ వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది. టెక్స్‌పోర్టు ఇండియా కంపెనీ త్వరలో ప్రారంభం కాబోతున్నది. అందులో రెండు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. చీర్లవంచలో అతిపెద్ద ఆక్వాహబ్ యూనివర్సిటీ, పరిశ్రమలు రాబోతున్నయి. వీటి ద్వారా 5వేల మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. నంది కమాన్ వద్ద పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలున్నయి.
చల్మెడ : యాభై ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీలు మన ప్రాంతానికి చేసిందేమి లేదు. సాగు, తాగునీటికి తండ్లాడిన మెట్ట ప్రాంతం మనది. నీళ్లులేక నెర్రెల బారిన భూములతో రైతులు అరిగోస పడ్డరు. ఎత్తిపోతల పథకం చేపట్టాలని దివంగత ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అప్పటి ప్రభుత్వాలకు అనేక సార్లు ప్రతిపాదనలు పంపించిండు. అసెంబ్లీలో ప్రస్తావించిండు. అయినా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలే. ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెచ్చిండు. నాటి పాలకులు మధ్యలోనే వదిలేసిన మధ్యమానేరు జలాశయాన్ని పూర్తి చేయించిండు.
మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని కాళేశ్వరం 9వ ప్యాకేజీ ద్వారా మల్కపేట రిజర్వాయర్ నిర్మించిండు. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరును నింపే పనులు పూర్తయినయి. మల్కపేట రిజర్వాయర్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగు, తాగునీటి గోస తీరింది. నాడు పనులు లేక దుబాయి, భీవండీలకు వలస పోయిన వారంతా మళ్లీ తిరిగి వాపస్ వస్తున్నరు. ఇంకా ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు శాయశక్తులా కృషి చేస్త. మన నియోజకవర్గం ఇతర రాష్ర్టాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా అభివృద్ధి చెందాలి.
విద్యా, వైద్యం అందరికీ అందాలి. అదే నా ఆశయం. పరిశ్రమ, వైద్య రంగాల్లో అనుభవమున్నవాడిగా చెబుతున్న. నియోజకవర్గ ప్రజలు మంచిగా ఆలోచించాలి. యాభై ఏండ్లలో జరగని అభివృద్ధిని కేవలం పదేండ్లలో కేసీఆర్ చేసి చూపిండు. చేసిన అభివృద్ధి మన కండ్ల ముందే కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్న. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు పట్టం కడితే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. వేములవాడ ఆదర్శ నియోజకవర్గంగా మారుతుంది.