విద్యానగర్, డిసెంబర్ 9: జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన నుంచి అనాథ వృద్ధురాలిని శుక్రవారం దవాఖాన అధికారులు వీబీ ఫౌండేషన్‌కు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనారోగ్యంతో బాధపడుతున్న గుర్తుతెలియని మూగ వృద్ధురాలిని 108 సిబ్బంది గుర్తించి చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇటీవల పూర్తిగా కోలుకుంది. వృద్ధురాలికి మాటలు రాకపోవడంతో ఆమె పేరు, ఊరును ఎవరూ కనుకోలేకపోయారు. దవాఖాన నుంచి విముక్తి కలిగించేందుకు సిబ్బంది వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం (వీబీ ఫౌండేషన్ ) నిర్వాహకుడు సీపెల్లి వీరమాధవ్కు సమాచారమందించారు. శుక్రవారం దవాఖానకు వచ్చిన వీరమాధవ్ వృద్ధురాలిని చూసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి కంటి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆశ్రమంలో 40 మంది వృద్ధులున్నారని తెలిపారు.
అనాథ వృద్ధులు ఉంటే తమకు అప్పగించాలని కోరారు. వారు బతికున్నంత వరకు కన్నవాళ్లు చేసినట్లు సపర్యలు చేస్తానని చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల అనుమతితో వృద్ధురాలిని ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆమెకు లక్ష్మి అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నమాల మాట్లాడుతూ అనారోగ్యంతో బాధ పడుతూ రోడ్ల పకన నివసిస్తున్న అనాథ వృద్ధులను ఎవరైనా దవాఖానలో చేర్పిస్తే వారి ఆరోగ్యం చకబడే వరకు చికిత్స అందిస్తామని చెప్పారు. ఎవరూ లేకపోతే వారిని అన్ని విధాలా దవాఖాన సిబ్బందే చూసుకుంటారని తెలిపారు. అనాథలకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్న వీబీ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన, డాక్టర్ పద్మ, డాక్టర్ హారతి తదితరులు పాల్గొన్నారు.