మొన్నటిదాకా పంటను కాపాడుకునేందుకు ఆగమైన రైతులు, ఇప్పుడు ధాన్యం అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంపై ఆగ్రహిస్తున్నారు. గురువారం వీర్నపల్లి మండలం వన్‌పల్లి, గంభీరావుపేట మండలం ముస్తఫానగర్, చందుర్తిలో రోడ్డెక్కారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ధర్నాలు చేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఫొటోలకు ఫోజులిచ్చి కేంద్రాలు ప్రారంభించారని, తీరా ధాన్యం తెస్తే రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు. రైతులను ఇలా ఇబ్బంది పెట్టడం ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 24 : వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన వంద మంది రైతులు సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఎర్రటి ఎండలోనే ఆందోళన చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటామని చెప్పుకొన్నా అధికారులెవరూ పట్టించుకోలేదు.
కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే గేట్లను పోలీసులు మూసి వేశారు. దీంతో కలెక్టరేట్ గేటు ఎదుట సుమారు గంటపాటు ధర్నా చేసినా కలెక్టర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ‘కలెక్టర్ రావాలి.. మా సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశా రు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నెల క్రితమే కోతలు పూర్తయ్యాయని, ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొనుగోలు పూర్తయి డబ్బులు కూడా రైతులకు అందించారన్నారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, కేవలం సిరిసిల్ల జిల్లాలోనే ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ఇపుడు కేవలం వన్‌పల్లి గ్రామస్తులం మాత్రమే ధర్నాకు వచ్చామని, సమస్య పరిష్కరించకుంటే ప్రతి గ్రామం నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకుంటామని రైతులు హెచ్చరించారు. కాగా, ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోవడంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు ఐదుగురు రైతులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వద్దకు తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోళ్లు చేసి లారీలను పంపిస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.
చందుర్తి, ఏప్రిల్ 24: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని చందుర్తి మండల రైతులు డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలోని కోరుట్ల -వేములవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు గడిచినా ఇప్పటివరకు కేవలం నాలుగైదు లోడ్ లారీలే కొన్నారని మండిపడ్డారు. రైతులకు గన్నీ సంచులు ఇవ్వడం లేదని, హమాలీలు లేరని తూకం వేయడం నిలిపివేశారని ధ్వజమెత్తారు. పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరవింపజేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు మర్రి రాజు, మర్రి రాములు, బత్తుల కమలాకర్, సిరికొండ శ్రీనివాస్, మర్రి మల్లేశం, మింగని రవి, రమేశ్, లక్ష్మీరాజం పాల్గొన్నారు
గంభీరావుపేట, ఏప్రిల్ 24: గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగారు. కామారెడ్డి-సిద్దిపేట ప్రధాన రోడ్డుపై ధర్నా చేశారు. కేంద్రం ప్రారంభించి పది హేను రోజులవుతున్నా ఇప్పటివరకు రెండు లారీల వడ్లను మాత్రమే కొన్నారని, ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయని, ఇలా అయితే ఇంకెన్నాళ్లకు పూర్తవుతుందని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్ మారుతిరెడ్డి రైతులకు ఫోన్ చేసి వెంటనే కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.