ఆడబిడ్డ ఉన్న కుటుంబాలకు ఆలంబనగా.. చేయూతగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన కొత్త బాలికల సంరక్షణ చట్టం అటకెక్కిందా..? ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉంటే.. వారికి 20 ఏండ్ల వయస్సు నిండాక వివాహానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన మాటకు మంగళం పాడారా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. 2005లో అప్పటి కాంగ్రెస్ సర్కారు అమల్లోకి తెచ్చిన స్కీంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని అర్హులుగా గుర్తించి, ఎల్ఐసీ బాండ్లు పంపిణీ చేసింది. అయితే ఏడాదిగా అవి మెచ్యూరిటీకి వస్తుండగా, పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఆశావహులు పత్రాలు పట్టుకొని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, తమకేం తెలియదనే సమాధానమే వినిస్తున్నది. అయితే అప్పుడు పథకం తెచ్చిన సర్కారే ఇప్పుడు అధికారంలో ఉన్నందున లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ఒక నిర్ణయం ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
జగిత్యాల, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వనిత-విజయ్ దంపతులు (పేర్లు మార్చాం). 2002లో వీరికి వివాహం జరిగింది. వనిత బట్టలు కుట్టేది.. విజయ్ ఎలక్ట్రిషన్ పని చేసే వాడు. భార్య, భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసే వారే కావడంతో ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితే ఉండేది. బతుకుదెరువు జగిత్యాల పట్టణంలో ఉండడంతో విద్యానగర్‌కు మకాం మార్చారు. మూడునాలుగేండ్లు అంతా సవ్యంగానే సాగింది. 2005లో వనిత ఆడశిశువుకు జన్మనిచ్చింది. దంపతులు ఇద్దరూ సంతోషించారు.
అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండలేదు. రోడ్డు ప్రమాదంలో విజయ్ మృతిచెందాడు. దీంతో వనిత, నెలల వయసులో ఉన్న ఆడకూతురు అనాథలుగా మారారు. వనిత ధైర్యాన్ని కూడదీసుకొని బిడ్డను పెంచడం మొదలుబెట్టింది. అదే సమయంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొత్త బాలిక సంరక్షణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. ఒక్క ఆడబిడ్డ ఉన్న వారికి 20 ఏండ్ల తర్వాత వివాహానికి రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు. చిన్నారులను పథకంలో చేర్పించాలని సూచించడంతోపాటు శిశు సంరక్షణ శాఖకు ఈ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో అధికారులు, అంగన్వాడీ టీచర్లు తమ పరిధిలో ఉన్న వారిని గుర్తించి పథకంలో భాగస్వామ్యం చేయించారు.
వనిత-విజయ్ కూతురైన స్రవంతిని సైతం చేర్పించారు. రెండేండ్ల క్రితం వనిత సైతం అనారోగ్యంతో మృతిచెందింది. చిన్న తనంలోనే తండ్రి, యుక్త వయసుకు వస్తున్న తరుణంలోనే తల్లి చనిపోవడంతో స్రవంతి ఒంటరిగా మిగిలింది. ఒక రోజు స్రవంతికి తమ ఇంట్లో ఉన్న సూట్‌కేస్‌లో పథకానికి సంబంధించిన బాండ్ పేపర్ కనిపించింది. కార్డును తీసుకొని, తనకు తెలిసిన ఒక అంగన్వాడీ టీచర్ వద్దకు వెళ్లి చూపించింది. ఇరవై ఏండ్ల క్రితం పథకంలో భాగంగా బాండ్ పేపర్ ఇచ్చారని, ఇది తీసుకొని వెళ్లి ఆఫీసుల్లో అధికారులను కలిస్తే రూ.లక్ష ఇస్తారని అంగన్వాడీ టీచర్ చెప్పడంతో స్రవంతి వెళ్లింది. విషయం చెప్పింది. బాండ్ ఇప్పించిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు తమ కేమి తెలియదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఎల్ఐసీ అధికారులు పేర్కొనడంతో స్రవంతి అవాక్కైంది. బతుకుదెరువుకు అక్కెరకు వస్తాయన్న నమ్మకంతో స్రవంతి ఏడాదిగా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇలా ఒక్క స్రవంతే కాదు స్కీం మెచ్యూరిటీకి వచ్చిన జిల్లాలోని వందలాది మంది పడుతున్న వేదన ఇది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన పథకం తీరు ఇది.
2005లో కొత్త బాలిక సంరక్షణ చట్టం
అంతర్జాతీయంగా బాలిక సంరక్షణ, పోషకాహార ప్రాధాన్యత తదితర అంశాల నేపథ్యంలో యూఎన్ఓ ప్రపంచ వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లల కోసం చేపట్టిన విషయం తెలిసిందే. 1997-2010 మధ్య కాలంలో యునిసెఫ్, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు పెద్ద మొత్తంలో నిధులను దేశ దేశాలకు పంపిణీ చేశారు. మనదేశానికి సైతం అధిక మొత్తంలోనే నిధులు వచ్చాయి. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వాలు ఆడబిడ్డల రక్షణ, సంక్షేమం కోసం పలు పథకాలను చేపట్టాయి. ఉమ్మడి ఏపీలో చంద్రబాబునాయుడు బాలిక సంరక్షణ పథకాన్ని 2001లో అమల్లోకి తెచ్చాడు.
ఒక్క కూతురు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే ఆ ఆడబిడ్డ పెండ్లి కోసం 20 ఏండ్ల తర్వాత రూ.లక్ష ఎల్ఐసీ ద్వారా ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేశాడు. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చట్టంలో మార్పులు తెస్తూ “కొత్త బాలిక సంరక్షణ చట్టం-2005”ను అమల్లోకి తెచ్చాడు. పథకంలో కొన్ని నిబంధనలను చేర్చారు. ఒక్క కూతురు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకుంటే ఆ చిన్నారికి రూ.లక్ష ఇచ్చే క్లాజ్‌ను కొనసాగిస్తూనే, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే, 20 ఏండ్ల తర్వాత ఒక్కొక్క అమ్మాయి వివాహానికి రూ.30వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు.
అలాగే బాలిక సంరక్షణ పథకంలో బాండ్ పొందిన పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్ దాకా ఏటా రూ.1200 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించారు. అలాగే తల్లిదండ్రుల్లో ఎవరు చనిపోయినా పిల్లలకు బీమా డబ్బులు ఇస్తామని పేర్కొంటూ జీవోను జారీ చేశారు. పథకం నిర్వహణ బాధ్యతను మహిళ శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తెచ్చి, ఎల్ఐసీ సంస్థను ఇందులో భాగం చేశారు. బాండ్ల గడువు ముగిసిన తర్వాత ఎల్ఐసీ కార్యాలయాల నుంచి ైక్లెయిమ్ చేసుకోవచ్చని జీవోలో పొందుపర్చారు. అంగన్వాడీ టీచర్లందరినీ వినియోగించి, వారి పరిధిలో ఉన్న అర్హులైన వారిని పథకంలోకి తెచ్చారు.
లక్షలాది మందికి బాండ్ పేపర్లు
కొత్త బాలిక సంరక్షణ పథకంలో 2005-2013 వరకు అర్హత ఉన్నవారందరికీ బాండ్ పేపర్లు ఇచ్చారు. అధికారిక అంచనా ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 4.93 లక్షల మంది బాండ్లు పొందారు. తెలంగాణ వ్యాప్తంగా 2.25 లక్షల మందికి ఇచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 22,456 మంది బాండ్ పేపర్లు పొందినట్లుగా తెలుస్తోంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో జారీ చేసిన బాండ్ పత్రంలో ఐడీ నంబర్, లాభోక్తులు, తల్లిదండ్రుల ఫొటో, ఎల్ఐసీ సంస్థ సహకారం, నామినీ పేరు తదితర వివరాలు పేర్కొన్నారు. బాండ్ పేపర్ల దిగువన స్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల సంతకాలతో జారీ అయ్యాయి.
మాకెం తెలియదంటున్న అధికారులు
పథకం 2013 తర్వాత నిలిచిపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పటికే బాండ్ పేపర్లు తీసుకున్న వారు ఇంకా గడువు ముగిసేందుకు చాలా టైం ఉండడంతో పెద్దగా పథకం చర్చనీయాంశంగా మారలేదు. దశాబ్దకాలం చూస్తుండగానే గడిచిపోయింది. కొత్త బాలిక సంరక్షణ చట్టం బాండ్ పేపర్ల మెచ్యూరిటీ 2025లో గడువు ముగిసిపోయింది.
అప్పటి నుంచి సమస్యలు ప్రారంభమయ్యాయి. 20 ఏండ్ల క్రితం బాండ్ పేపర్లు తీసుకున్నవారు తమ వద్ద ఉన్న పత్రాలను తీసుకొని వెళ్లి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సంబంధిత శాఖ అధికారులకు బాండ్ పేపర్లతో వచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. చాలా మంది అధికారులు, సిబ్బంది తమ శాఖ నేతృత్వంలో బాండ్ పేపర్లు జారీ చేయబడినా, ఎల్ఐసీ సహకారంతో ఇచ్చినవే అని, మెచ్యూరిటీ గడువు ముగిసింది గనుక ఎల్ఐసీ ఆఫీస్‌లో సంప్రదించాలని సూచిస్తున్నారు. అక్కడికి వెళ్లి అడిగితే తమకేం తెలియదని, పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతుండడంతో బాండ్దారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అంతా మోసం..
బాలిక సంరక్షణ పథకంలో బాండ్ పేపర్లు పొందిన చాలా మంది ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పథకంలో పేర్కొన్న ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదంటున్నారు. తమ పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్కాలర్పిష్ రానేలేదని, బాండ్ పేపర్ జిరాక్స్‌ను పెడుతూ దరఖాస్తు చేసినా పట్టించుకునే నాథుడు లేడంటున్నారు. ఇక చాలా మంది తల్లిదండ్రులను కోల్పోయారని, వారికి బీమా సొమ్ము ఇస్తామని జీవోలో పేర్కొన్నారని, ఒక్కరికి ఒక్క రూపాయి సాయం అందలేదని మండిపడుతున్నారు. ఇప్పుడు 20 ఏండ్ల తర్వాత బాండ్ పేపర్ పట్టుకొని పోతే మాకేం తెలియదంటున్నారని, ఇంత అన్యాయం, అక్రమం సర్కారే చేస్తే ఎట్లా..? అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బాలిక సంరక్షణ పథకాన్ని అమలు చేశారని, ఇప్పుడు సైతం కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉందని, ఈ పథకంలో బాండ్ పొందిన వారి విషయంలో ఏదో ఒక్క నిర్ణయం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.