UREA | రాయికల్, ఆగస్టు 29 : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడి కాపులు కావలసిన పరిస్థితి నెలకొంది. రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అరకోరగా వస్తున్న యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. రాయికల్ మండలం ఇటిక్యాల, అల్లీపూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శుక్రవారం ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ సహకార సంఘ పరిధిలోని రైతులు ఉదయం నుండే యూరియా కోసం పట్టాదారు పాసుపుస్తకాల క్యూ లైన్ లో యూరియా కోసం వేచి ఉన్నారు. ఇటిక్యాల సొసైటీ కి 230 యూరియా బస్తాలు రాగా సుమారు 200 మంది రైతులు యూరియా కోసం పాస్ పుస్తకాల జిరాక్స్ తో సొసైటీ ముందు వేచి ఉండి యూరియా తీసుకువెళ్లారు. గరిష్టంగా ఒకరికి నాలుగు బస్తాల చొప్పున యూరియాను సొసైటీ అధికారులు అందజేయగా వందమంది వరకే యూరియా అందింది. మిగతా వారికి యూరియా అందకపోవడంతో యూరియా మళ్లీ ఎప్పుడు వస్తుందోనని నిరాశతో ఇంటికి వెనుదిరిగారు.
అల్లీపూర్లోనూ అంతే..
ఇదిలా ఉంటే అల్లీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా లోడ్ వస్తుందన్న సమాచారం మేరకు ఆ సొసైటీ చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా శుక్రవారం ఉదయం సొసైటీ ముందు పడిగాపులు గాచి యూరియా బస్తాల కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టారు. తీరా యూరియా రాకపోవడంతో పోలీసులు వ్యవసాయ అధికారులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి క్యూ లైన్ లో ఉన్న రైతుల వివరాలను నమోదు చేసుకుని యూరియా రాగానే సీరియల్ నెంబర్ ప్రకారం యూరియాను అందజేస్తామని చెప్పడంతో రైతులు అక్కడి నుండి వెళ్లిపోయారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు రాలేవని రైతులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం రైతులు క్యూలైన్లో చెప్పులు పాస్ పుస్తక జిరాక్స్లు పెట్టి యూరియా కోసం గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా వచ్చిన ప్రతీ సారి అరకొరగా రావడంతో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలనే రైతులు డిమాండ్ చేస్తున్నారు.