Koppula Eshwar | జగిత్యాల, సెప్టెంబర్ 5: యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని, యుద్ధ ప్రాతిపదికన కేద్రం నుండి తెప్పించాలని, రైతుల కష్టాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించామని, బీజేపీ, కాంగ్రెస్ యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు.
రైతులను అదోగతి పాలు చేస్తున్నారని, యూరియా లేకపోవడం వల్ల పొలాలు ఎర్రబాడుతున్నాయని, దిగుబడి తగ్గడం, చీడపిడల వల్ల నష్టపోతామని రైతుల గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని, నిజాలు తెలుసు కోవడానికి రావాలని ఇటీవల మహబూబాబాద్ లో మహిళలు యూరియా విషయంలో ఇబ్బందులు చూశామన్నారు.
యూరియా కోసం 8లక్షల 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించడం, ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సిన నిమ్మకు నిరేతినట్టు ఉందనీ, సీఎం, మంత్రులు అదే విదంగా ఉన్నారనీ విమర్శించారు. రేవంత్ సర్కార్ గత కాంగ్రెస్ సర్కారు రోజులు తీసుకొచ్చారని, యూరియా పోలీస్ పహారాలో సరఫరా, చెప్పులు లైన్ లో ఉంచడం, మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మీకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మంత్రి అడ్లూరి ఏంచేస్తున్నారని మండిపడ్డారు. తాము ఉన్నపుడు ఎలా ఉందని, వచ్చే సిజన్ లో ఒక్క కిలో కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20నెలలు అయిందని, కామారెడ్డి పర్యటన లో కూడా సీఎం ఇటీవల కేసీఆర్ ని తిట్టడమే పనిగా ఉందనీ, పని చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండని, స్వంత డబ్బా కొట్టుకోవడం బంద్ చేయండనీ, కాళేశ్వరం విషయంలో గోష్ కమిషన్, సీబీఐకు ఇవ్వడం మీ మంత్రులు కూడా సంతోషంగా లేరని, ప్రజల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని చెప్పారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ సీఎం ఓట్లకు ముందు ఒక తిరుగా, తర్వాత ఒక తిరుగా అబద్దాల, అసమర్థ ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు.
కాగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ కవిత విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కవితని ఆడబిడ్డ గా గౌరవిస్తామని, కాళేశ్వరం విషయంలో హరీష్ రావుఫై ఆరోపణ విషయంలో కొప్పల ఈశ్వర్ ఖండించారు. ఎమ్మెల్సీ కవిత కొన్ని రోజులుగా కేటీఆర్ పై, ఇప్పుడు హరీష్ రావుపై చేసిన ఆరోపణలను జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తప్పుబట్టారు. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ అని, కేసీఆర్ ని కాదనుకొని వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, సమిండ్ల వాణి శ్రీనివాస్, అవారి శివాకేసరి బాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, జగిత్యాల రూరల్, అర్బన్ అధ్యక్షులు ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, నీలి ప్రతాప్, కోటగిరి మోహన్, దావ సురేష్, జవ్వాజి ఆది రెడ్డి, హరీష్ కల్లూరి, చందా సాయి తదితరులు పాల్గొన్నారు.