ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 11 : రైతుల గోస వర్ణనాతీతంగా ఉన్నది. ఎక్కడ చూసినా వ్యథే కనిపిస్తున్నది. నెలలు గడిచినా యూరియా దొరక్క ఆగమవుతూనే ఉన్నారు. రోజుల కొద్దీ తిరిగినా.. గంటల పాటు బారులు తీరినా ఒక్క బస్తా కూడా దొరక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ పీఏసీఎస్ గోదాం వద్ద టోకెన్లు తీసుకొని నెలదాటినా యూరియా అందక తిమ్మాపూర్, గుండారం, బాకుర్‌పల్లి గ్రామాల రైతులు విసిగిపోయారు. బుధవారం సహకార సంఘం వద్దకు వచ్చి అధికారులను అడిగితే, గురువారం వస్తుందని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. తిరిగి గురువారం ఉదయం వచ్చి, వేచి చూసినా బస్తాలు రాకపోవడంతో ఆగ్రహించారు. సుమారు 150 మంది ఉదయం 9గంటలకు నేరుగా తిమ్మాపూర్ బస్టాండ్‌కు చేరుకున్నారు. యూరియా వచ్చేదాకా లేవబోమని కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై గంటపాటు బైఠాయించారు. నెల క్రితం టోకెన్ల కోసం 500కు పైగా కార్డులు లైన్లో పెట్టామని, పక్కనున్న గొల్లపల్లి, బొప్పాపూర్, లింగాపూర్‌కు కొద్దోగొప్పో పంపారని, కానీ తమకు మాత్రం నెల రోజులైనా పంపడం లేదని మండిపడ్డారు.
వచ్చిన యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో బలవంతంగా రోడ్డు పైనుంచి పక్కకు తప్పించి, అధికారులతో మాట్లాడారు. సాయంత్రం వరకు వస్తుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అధికారులు చెప్పినట్టు మధ్యాహ్నం 3గంటలకు తిమ్మాపూర్ గ్రామపంచాయతీ వద్దకు యూరియా లోడ్ వచ్చినా.. 300 బస్తాలే రావడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అవి మహిళా సంఘం తరఫున వచ్చాయని, ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంచితే 150 మందికే వస్తాయని, మిగతా రైతుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. అధికారులు మాత్రం రెండు, మూడు రోజుల్లో మరో లోడు వస్తుందని చెబుతున్నా తమకు నమ్మకం కలుగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజులుగా రాని యూరియా తాము ధర్నా చేస్తే తప్ప ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు.
నాట్లేసి రెండు నల్లైతుంది. ఇంత వరకు యూరియా లేదు. సేన్లు మొత్తం కరాబైతున్నయ్. ఉరివెట్టుకునే పరిస్థితికచ్చింది. ఇంతగనం కష్టపడితే ఫలితం లేకుంటైంది. ఇదేం ప్రభుత్వం? దొంగ ప్రభుత్వం. రైతులు ఆత్మహత్య జేసుకునే కాలానికచ్చింది. పరిస్థితి ఘోరంగున్నది. రోడ్లమీదికెక్కే పరిస్థితికచ్చింది. ఎవ్వలు యూరియా గురించి పట్టించుంటలేరు.
నేను పదెకరాలు నాటేస్తే నాలుగు బస్తాల యూరియిచ్చిన్రు. ప్రైవేటోళ్లకిత్తున్రు. సొసైటోళ్లకిస్తలేరు. నాలుగు బస్తాలతోటి పదెకరాల పంట ఎట్ల పండుతది? ఏవో స్పందించాలె. యూరియా మొత్తం బ్లాకులమ్ముతున్నరు. కలెక్టర్ స్పందించి మాకు యూరియా పంపాలె.