Mancharami | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 20 : గత కొన్ని నెలల నుంచి గ్రామంలో కోతుల బెడద తీవ్రమైంది. వివిధ అవసరాల రీత్యా ఇంటి నుంచి బయటికి వచ్చిన గ్రామస్తులపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయంపై రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి-లక్ష్మిదంపతులు స్పందిస్తూ కోతులను నియంత్రణకు శ్రీకారం చుట్టారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి సొంత ఖర్చులతో గతంలో కొండెంగను తీసుకువచ్చి ద్విచక్ర వాహనంపై ఎక్కించి, ఒక మనిషిని తో గ్రామంలో తిప్పడం వల్ల కోతులు తగ్గుముఖం పట్టాయి. తాను తప్పుకోవడంతో మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపుగా 25 మంది వరకు కోతులు గాయపరిచాయి.
ఈ విషయాన్ని తెలుసుకున్న రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి-లక్ష్మీ దంపతులు వారి సొంత ఖర్చులతో ఒక్కో కోతికి రూ.500 చొప్పున ఇస్తూ కోతులను గ్రామం నుండి పట్టించి దాదాపు 50 కోతులను చెన్నూరు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సొంత ఊరిపై మమకారంతో కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోతుల సమస్యను తీర్చారు : రజిత, మంచరామి గ్రామస్తురాలు
గ్రామంలో కోతుల బెడద పెరిగింది. కోతులు చేసే పనుల వల్ల బయటికి రావాలంటే భయమేస్తుంది. ఇంట్లోకి చొరబడి పప్పు దినుసులు, వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. చాలామందిని గాయపరిచాయి. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి-లక్ష్మి దంపతులు ముందుకు వచ్చి వారి సొంత ఖర్చులతో కోతులను పట్టిస్తున్నారు. గతంలో కూడా తిరుపతి సార్ కొండెంగను తీసుకువచ్చి గ్రామంలో తిప్పడంతో కోతులు తగ్గుముఖం పట్టాయి. వారు విరమించుకున్న తర్వాత కొద్ది రోజుల వరకూ రాలేదు. ఇటీవల కోతులు ఎక్కువగా వస్తున్నాయి. మళ్లీ కోతులు లేకుండా చేయడం అభినందనీయం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.