వీర్నపల్లి/ ఇల్లంతకుంట/ కోనరావుపేట/ రుద్రంగి ఏప్రిల్19: కొద్ది రోజులుగా భయపెడుతున్న అకాల వర్షం, శుక్రవారం రైతన్నను ఆగమాగం చేసింది. పొద్దంతా ఎండకొట్టినా.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షం పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఇల్లంతకుంట, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ఈదురుగాలులతో వాన పడగా.. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది.
కొన్నిచోట్ల వరి నేలవాలింది. చేతికొచ్చిన దశలో మామిడి కాయలు నేలరాలాయి. వీర్నపల్లి మండల వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో 8వేలకుపైగా క్వింటాళ్ల ధాన్యం తడువడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లిలో పారిపెల్లి రాజిరెడ్డికి చెందిన బర్రె పిడుగుపాటుతో మృతి చెందింది.