కొన్ని రోజుల్లో పంటలు చేతికొస్తాయని సంబురపడ్డ రైతుల ఆశలన్నీ నేలపాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము దాకా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సానికి మక్క, వరి, మామిడి దెబ్బతిన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లగా, ఒక్క జగిత్యాల జిల్లాలోనే 9వేలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగా, రైతులకు మరోసారి కన్నీళ్లే మిగిలాయి.
– చొప్పదండి/ వీణవంక/ గన్నేరువరం/ జగిత్యాల టౌన్, మార్చి 31
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 9,393 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదికలో తెలిపారు. 1521 ఎకరాల్లో మక్క, 1128 ఎకరాల్లో వరి, 582 ఎకరాల్లో నువ్వు పంటలకు నష్టం వాటిల్లినట్లు డీఏవో భాస్కర్ పేర్కొన్నారు. ప్రధానంగా 6,155 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయని జిల్లా ఉద్యాన అధికారి లత తెలిపారు. కోరుట్ల మండలంలో సుమారు 260 ఎకరాల్లో వరి, 45 ఎకరాల్లో మక్క, 550 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మల్లాపూర్తోపాటు మండలంలో వరి, మక్క, నువ్వు పంటలు నెలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్లో పోసిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట, సిరికొండ, కలికోట, అంబారిపేట, తాండ్య్రాల, తక్కళ్లపెల్లి, కథలాపూర్ గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లోని వరి, మక్క, మామిడి, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. గొల్లపల్లి మండలంలో మామిడి తోటలు, మక్క, నువ్వు చేన్లు దెబ్బతిన్నాయి. ధర్మపురి మండలంలోని నక్కలపేట, దమ్మన్నపేట, రాజారం, జైన, కొసునూర్పల్లి, దొంతాపూర్, ఆరెపెల్లి గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. రామయ్యపల్లి, తిమ్మాపూర్, రాయపట్నం, కమలాపూర్, రాయపట్నం గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది.

కమలాపూర్ శివారులో చెట్లు విరిగి రోడ్డు పై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెగడపల్లి మండలంలో మక్కతోపాటు వరి, నువ్వుల పంట నేలవాలిపోగా, మామిడి కాయలు రాలిపోయాయి. జగిత్యాల రూరల్ మండలంలోని కన్నాపూర్, చలిగల్, లక్ష్మీపూర్ తదితర గ్రామాల్లో మక్క నేలకొరుగగా, మామిడి కాయలు రాలిపోయాయి. పసుపు వర్షానికి తడిసి ముద్దయింది. సారంగాపూర్, బీర్పూర్ మండలంలో 350 ఎకరాల్లో మక్క, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. కొడిమ్యాలతోపాటు తిర్మలాపూర్, కోనాపూర్, గంగారాంతాండ, నల్లగొండ, నమిలకొండ గ్రామాల్లో మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మెట్పల్లి మండలంలో 25 ఎకరాల్లో వరి, 65 ఎకరాల్లో నువ్వులు, 20 ఎకరాల్లో సజ్జ, 630 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలో మంతెన రాజేశ్ ఇంటి గోడ కూలి పక్కన పార్కింగ్ చేసి ఉన్న కారుపై పడడంతో కారు ధ్వంసమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కేశన్నపల్లి, పత్తికుంటపల్లి, ముస్కానిపేట, తాళ్లపెల్లి గ్రామాలలో మక్క పంటలు నేలకొరగగా, మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. చందుర్తి మండల కేంద్రంతోపాటు తిమ్మాపూర్, మల్యాల గ్రామాల్లో సుమారు 120 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. వీర్నపల్లి మండలంలోని అడవి పదిర, లాల్సింగ్ తండాలో పొలాలు నేలవాలాయి.

పెద్దపల్లి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల, కూనారం, వెన్నంపల్లి, గంగారం, మంగపేట, లక్ష్మీపురం గ్రామాల్లో సుమారు 443 ఎకరాల మక్క, 271 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. ఓదెల మండలంలోని ఓదెల, కొలనూర్, హరిపురం, గోపరపల్లి, పిట్టల ఎల్లయ్యపల్లె, నాంసానిపల్లి గ్రామాల్లో పంటలు నేలవాలాయి. కొలనూర్-పెగడపల్లి గ్రామాల మధ్యన చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. పాలకుర్తి మండలంలోని కన్నాల, జయ్యారం, పుట్నూర్, రామరావుపల్లి, కొత్తపల్లి, కుక్కలగూడూర్, తదితర గ్రామాల్లో మక్క పంటకు నష్టం వాటిల్లింది. ధర్మారం మండలంలోని బొట్లవనపర్తి, నందిమేడారం, సాయంపేట, కొత్తూరు, కటికెనపల్లి, చామనపల్లి గ్రామాల్లో సుమారు 600 ఎకరాల్లో మక్క పంటలు నేలవాలాయి.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి గ్రామాల్లో మక్క పంటలు నేలవాలాయి. మొత్తం 50 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. చొప్పదండి మండలంలో వందలాది ఎకరాల్లో మక్క చేన్లు దెబ్బతిన్నాయి. గన్నేరువరం మండలంలో మక్క, మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్, బొమ్మకల్ గ్రామాల్లో మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

సారంగాపూర్/ రాయికల్ : మార్చి 31 : ఈదురు గాలులు, అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను సర్కారు ఆదుకోవాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో పర్యటించి, సోమవారం అర్ధరాత్రి అకాల వర్షానికి దెబ్బతిన్న మక్క, నువ్వు, కూరగాయల పంటలు, అలాగే రాయికల్ మండలం కిష్టంపేటలో మామిడి, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల రైతులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. నాడు కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగిందని గుర్తు చేశారు. నేడు రేవంత్రెడ్డి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా గోస పడుతూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సర్కారు మోసం చేసిందని ధ్వజమెత్తారు. కనీసం ఇప్పుడైనా మొద్దునిద్ర వీడాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తేలు రాజు, ధర్మనాయక్ తండా సర్పంచ్ భుక్యా సంతోష్ నాయక్, నాయకులు బైరి మల్లేశ్ యాదవ్, ఎండబెట్ల ప్రసాద్, పాంపర్తి రంజిత్, సాంబారి గంగాధర్, అత్తినేని నరేశ్, ఒడ్నాల జగన్, రవి, వెంకటేశ్ ఉన్నారు.