కరీంనగర్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. నిన్నామొన్నటి వరకు సాగునీరు అందించేందుకు తండ్లాడి పంటను కాపాడుకుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా రైతన్నకు తీరని నష్టం కలిగించింది. పంట చేతికొచ్చే దశలో ఉన్న మక్కజొన్న, వరి నేలవాలింది. అలాగే మామిడి పూత, కాత సైతం రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రభుత్వం పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 1,500ఎకరాల్లో వరి, 1,000ఎకరాల్లో మక్క, కరీంనగర్లో జిల్లాలో 336ఎకరాల్లో మక్క, జగిత్యాల జిల్లాలో 1,836ఎకరాల్లో వరి, 1,507ఎకరాల్లో మక్క, 33ఎకరాల్లో నువ్వులు, 862.6 హెక్టార్లలో మామిడి తోట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 130 ఎకరల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు వివరాలను వెల్లడించారు.
కాగా, చొప్పదండి మండలంలో అకాల వర్షంతో నేలకొరిగిన మక్కజొన్న, వరి పంటలతోపాటు వ్యవసాయ మారెట్లో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.