Atmakur godown | మెట్ పల్లి రూరల్, ఆగస్టు 11: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ పరిధిలోని ఆత్మకూర్ గ్రామానికి యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం వేకువజాము నుంచే ఆత్మకూర్ గ్రామంలోని గోదాం వద్ద గుమిగూడారు. కొందరు రైతులు గంటల తరబడి నిలబడలేక పట్టా పాస్ పుస్తకాలను వరుసలో పెట్టారు. 340 బస్తాల యూరియా రాగా ఎకరానికి ఒక సంచి చొప్పున అందజేశారు.
మిగతా రైతులు చేసేదిలేక వెనుదిరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గంటల తరబడి నిలబడినా ఎరువులు దొరకడం లేదని ఆరోపించారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆత్మకూర్ కు ఇప్పటికే రెండుసార్లు యూరియా వచ్చిందని, అప్పుడు తీసుకోని రైతులకు శుక్రవారం పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో యారియా వస్తుందని, అప్పుడు మిగతా రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.