Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 20 : ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీలతో యువతను ఆకర్షించిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముశం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నట్లు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రతీ సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలులో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన యూత్ డిక్లరేషన్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలపై ఆలస్యం.. యువతలో ఆందోళన
ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ నియామక ప్రక్రియలు వేగవంతం కాకపోవడం వల్ల లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని ముశం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా హామీలు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఖాళీ ఉద్యోగాలన్నింటికీ తక్షణమే నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఎన్నికల హామీల అమలుపై స్పందించకపోతే నిరుద్యోగ యువతతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, గురజాల శ్రీధర్, మల్లారం ప్రశాంత్, జిల్లా నాయకులు రామంచా అశోక్, ఎలిగేటి రాజశేఖర్, గాంతుల మహేష్, సుద్దాల సురేష్, దాసరి రూప, ఆడెపు రజిత, లక్ష్మి, శివ తదితరులు పాల్గొన్నారు.