Sunke Ravishankar | గంగాధర, సెప్టెంబర్ 11 : అండగా ఉండి ఆదుకోవాలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చేనేత కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గంగాధర మండలం గర్షకుర్తిలో గురువారం చేనేత పవర్ లూమ్స్ ను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. గర్శకుర్తి గ్రామంలో చేనేత కార్మికుని పవన్ లూమ్స్ పై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసిన చేనేత కార్మికుడు మిట్టపల్లి వెంకటేష్ ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ కు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో గర్శకుర్తి పవర్ లూమ్స్ కు 2022లో 20 లక్షల మీటర్ల బతుకమ్మ చీరలు, 2023లో 32 లక్షల 26 వేల 750 మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించిందని గుర్తు చేశారు. అలాగే 2 లక్షల 13 వేల 860 మీటర్ల స్కూల్ యూనిఫామ్స్, 24 వేల మీటర్ల రంజాన్ గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్ ఇచ్చి ఉపాధి కల్పించినట్టు పేర్కొన్నారు.
బతుకమ్మ చీరల తయారీతో కేసీఆర్ చేనేత, పవర్ లూమ్స్ కార్మికులు జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పవర్ లూమ్స్ కు బతుకమ్మ తరహా గుడ్డ ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఉపాధి లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఓ వైపు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక నేతన్నలు అవస్థ పడుతుంటే మరో వైపు చేనేత జౌళిశాఖ విజిలెన్స్ అధికారు పవర్ లూమ్స్ పై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్లు కల్పించి చేనేత పరిశ్రమలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హ్యాండ్ లూం రిజర్వేషన్ అఫ్ 1985 ఆర్టికల్ ఫర్ ప్రోడక్షన్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేసి, విజిలెన్స్ అధికారులు చేనేత కార్మికులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు కంకణాల విజయేందర్ రెడ్డి, మామిడిపల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.