ధర్మపురి, డిసెంబర్ 17: దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రాన్ని దర్శిస్తే యమపురి ఉండదనీ, ఇక్కడ దక్షణాభిముఖంగా ప్రవహిస్తున్న గోదావరిలో స్నానాలు చేస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.. ఈ క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచే గాక, పక్క రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. మొదట పవిత్ర గోదావరిలో స్నానాలాచరించి స్వామివార్లను దర్శించుకుంటారు. ఇటీవలి కాలంలో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో నీరు పారకం లేక సజీవంగా ఉండి గోదావరి దుర్గంధభరితంగా మారింది. క్షేత్రంలోని మురుగునీరు కూడా భక్తులు స్నానాలు చేసే చోటనే కలుస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతుండగా.. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఈ సమస్య పరిష్కారానికి ఉపక్రమించారు. రూ. 5.67కోట్లు మంజూరు చేయించి మహాడ్రైనేజీని నిర్మింపజేశారు. పట్టణంలోని బ్రాహ్మణ సంఘ భవనం నుంచి గోదావరి చివరి ఘాట్ అయిన మహాలక్ష్మీ ఘాట్, మోరెళ్ల వాగు వరకు దాదాపు 1800 మీటర్ల మేర ఈ మహాడ్రైనేజీని నిర్మించారు. పనుల్లో ఆరున్నర నుంచి ఏడు ఫీట్ల పైపులను వాడారు. ఈ అండర్ డ్రైనేజీపై బ్రాహ్మణ సంఘ భవనం నుంచి మహాలక్ష్మీ ఘాట్ వరకు రూ.2కోట్ల పంచాయతీ రాజ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు.
నీటిశుద్ధి కేంద్రం
భవిష్యత్తులో మోరెళ్ల వాగు నీరు కలిసే చోట సుమారు రూ. 6 కోట్లతో నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా కేంద్రం వద్దకు చేరిన మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి గోదావరిలోకి మళ్లీస్తారు. ఈ పనులు పూర్తయితే నదిలో దుర్గంధం దూరమవుతుందని, పవిత్ర స్నానాలకు కలుగుతుందని భక్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం..
ధర్మపురి క్షేత్రంలోని మురుగునీటిని నాటి పాలకులు గోదావరి నదికే అనుసంధానించారు. పట్టణంలో ఉన్న మురుగుకాలువలన్నీ ప్రధాన కాలువల్లో కలిసి వాటి ద్వారా గోదావరిలోనే కలిసేవి. కానీ నాడు నదిలో నీరు ఎక్కువగా ఉండేది కాదు. వానకాలం తప్పా మిగతా నెలల్లో ఒకటి, రెండు పాయలుగా మాత్రమే ప్రవహించేది. ఇసుక కూడా దిబ్బలుదిబ్బలుగా ఉండేది. దీంతో ఈ సమస్య అంతగా కనిపించలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రెండు, మూడు నెలలు మినహా ఏడాది పొడుగునా ధర్మపురి గోదావరి నీటితో కళకళలాడుతుంటుంది. దీంతో పట్టణంలోని డ్రైనేజీల ద్వారా వచ్చిన నీరు కూడా చేరి అక్కడికే చేరడంతో నీళ్లు కంపుకొట్టేవి. ఈ సమస్యను గుర్తించిన మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపి శాశ్వత పరిష్కారం చూపారు. మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. ఆ వెనువెంటనే ధర్మపురి అభివృద్ధికి రూ.25 కోట్లు మున్సిపల్ నిధులు మంజూరయ్యాయి. అందులో నుంచి గోదావరి మురుగుకాలువ నిర్మాణానికి రూ.3.67కోట్లు కేటాయించారు. అవి సరిపోకపోవడంతో సీఎం ప్రత్యేక నిధులు మరో రూ.2కోట్లు మంజూరు చేయించి పూర్తి చేయించారు.
గోదావరి పవిత్రతను కాపాడడం నా బాధ్యత
‘న భూతో నభవిష్యత్తు’ అన్న రీతిలో 2015 గోదావరి పుష్కరాలను నిర్వహించి ప్రపంచం దృష్టినే ఆకర్షించలగలిగనం. ఇంతటి ప్రాశస్థ్యమున్న గోదావరి పవిత్రతను కాపాడడం నా బాధ్యతగా భావించిన. రూ.5.67కోట్లతో పట్టణంలోని బ్రాహ్మణ సంఘ భవనం నుంచి మోరెళ్లవాగు కలిసే ప్రాంతం వరకూ హైదరాబాద్ లాంటి నగరంలో అండర్ డ్రైనేజీల కోసం వాడే 8 ఫీట్ల ఎత్తు గలిగిన పైపులను వాడి అండర్ మురుగుకాలువ నిర్మించినం. ఇది ఇంతటితో ఆగదు. మోరెళ్లవాగు గోదావరిలో కలిసే చోటే మురుగుకాలువ కూడా గోదావరిలో కలుస్తది. అక్కడే వాటర్ సీనరేజ్ ట్రీట్మెంట్ప్లాంట్ను (నీటిశుద్ధి కేంద్రం) కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్లాంట్ ద్వారా మురుగుకాలువ నీటిని శుద్ధి చేసి మళ్లీ గోదావరిలోకే వదులుతారు. గతంలో నీరు గోదావరిలో నీరు ప్రవహించడం సమస్య రాలేదు. ఇప్పుడు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ధర్మపురి వరకూ విస్తరించడంతో ఈ మురుగునీరు సమస్య ఏర్పడింది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించింది.
-రాష్ట్ర మంత్రి ఈశ్వర్