తెలంగాణ చౌక్, మార్చి 15: కరోనా మహమ్మరి గత రెండు మూడేళ్లుగా విద్యార్థులను పాఠశాలలకు, ప్రత్యేక్ష బోధనకు దూరం చేసింది. ఈ యేడాది పాఠశాలలు చాలా అలస్యంగా పున:ప్రారంభమయ్యాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం ‘రీడ్’లాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వారి విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం మే నెలలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ఈ యేడాది రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ ప్రత్యేక కసరత్తు చేస్తుంది. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి రోజు సాయంత్రం పూట ప్రత్యేక తగరతులు నిర్వహిస్తున్నది. రోజువారీగా స్లిప్ టెస్టులు పెడుతూ విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. వివిధ సబ్జెక్టుల్లో వెనకబడిన వారిపై ఉపాధ్యాయులు దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా 45 రోజుల ప్రణాళిక రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 5,832 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దాదాపు ఇప్పటికే సిలబస్ పూర్తిచేశారు. విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేర కు ప్రభుత్వ బడుల్లో గత నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ధేశించిన సబ్జెక్టుల్లో విషయాన్ని చదివించి, చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు ప్రకారం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం స్టడీ అవర్ నిర్వహిస్తూ.. టెస్టులు పెడతున్నారు. సబ్జెక్టుల వారీగా తదుపరి రోజు రెగ్యులర్ పీరియడ్లో స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల స్థాయిని గుర్తించి, తగిన సూచనలిస్తున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ గురించి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యసన స్థాయిని వారికి తెలియజేస్తున్నారు.
పదో తరగతి ప్రత్యేక తరగతుల నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ టైం స్కూల్లోనే గడపాల్సి వస్తుంది. దీంతో విద్యార్థులు అర్ధాకలితో చదువుపై శ్రద్ధ చూపరనే ఉద్దేశంతో వారికి అల్పాహారం అందజేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో ‘గోరుముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విద్యార్థులకు సహకారాన్ని అందజేయాలని డీఈవో రాధాకిషన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల్లో దాతలు ముందుకు వచ్చి సాయంత్రం పూట విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు.
ప్రత్యేక తరగతులు పక్కాగా నిర్వహిస్తున్నం. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకురావడం హర్షణీయం. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి గోరుముద్ద కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, రోజువారీగా రివిజన్ టెస్టులు, ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తున్నాం. వెనబడిన విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– డీ రాధాకిషన్, జిల్లా విద్యాధికారి (సిరిసిల్ల)