Road accident | ఎల్లారెడ్డిపేట, జూన్ 21: మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఓ యువకుడు తన బైక్‌తో టీవీఎస్పై వెలుతున్న ఓ వీఆర్ఏను డీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం జరిగింది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన వీఆర్ఏ బాద రాములు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై తహసీల్దారు కార్యాలయానికి ప్రధాన రహదారి నుంచి కార్యాలయానికి మలుపు తిప్పాడు. అదే సమయంలో సిరిసిల్ల వైపు బైక్ పై వేగంగా వెలుతున్న కిష్టూనాయక్ లోని ఒడ్డెర కాలనీకి చెందిన తిమోతి అనే యువకుడు డీకొట్టాడు.
దీంతో బాధ రాములు కుడికాలు విరిగి తీవ్రరక్తస్రావమైంది. తిమోతి ఎగిరిపడటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇద్దరిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని అశ్వినీ హాస్పిటల్‌కు తరలించారు. బాద రాములు పరిస్థితి విశమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైద్రాబాద్‌కు తరలించారు. వీఆర్ఏ గాయపడిన సమాచారం తెలుసుకుని రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం తక్షణ సాయంగా రూ.20వేల నగదును రాములు కుటుంబానికి అందించారు.