చెరువులో మునిగి అక్కాచెల్లెళ్ల మృతి
సుల్తానాబాద్ పట్టణంలోని పూసాలలో ఘటన
శోకసంద్రంలో తల్లిదండ్రులు
ఇద్దరు చిన్నారులైన అక్కాచెల్లెళ్లు అప్పటి దాకా అంగన్వాడీ కేంద్రంలో అందరితో కలివిడిగా తిరిగారు. ఇంటి కొచ్చిన తర్వాత ఆడుకుంటూ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగి మృత్యువాతపడ్డారు. తమ ఇద్దరు కూతుళ్లూ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాలలో సోమవారం జరిగిన ఈ ఘటన విషాదం నింపింది.
సుల్తానాబాద్, జూన్ 27: అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్లు. వీరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అభ్యసిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లారు. అయితే కేంద్రం ముగిసే సమయానికి గంట ముందే తల్లి అక్షిత అంగన్వాడీ సెంటర్‌కు వెళ్లి పని ఉందని చెప్పి ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లా రు.
ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగిపోయారు. గ్రామస్తులు అక్కడి చేరుకొని చిన్నారులను నీటిలో నుంచి వెలికితీసి సుల్తానాబాద్ దవాఖానకు అక్కడి నుంచి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృత దేహాలపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేందర్‌రావు తెలిపారు.