కోరుట్ల, జూన్ 15: విగ్రహాల తయారీ కేంద్రంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. భారీ వినాయక విగ్రహాన్ని ఒక చోట నుంచి మరో చోటుకు తరలిస్తుండగా, షాక్ తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోరుట్లలో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డులో ఉన్న శ్రీబాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రాన్ని ప్రకాశం రోడ్డు కాలనీకి చెందిన అల్వాల వినోద్ పదేళ్లుగా నిర్వహిస్తున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం వర్షం వస్తుందనే అనుమానంతో షెడ్డు ఆవరణలో ఉన్న 12 ఫీట్ల వినాయక గణేశ్ విగ్రహాన్ని మరో షెడ్లోకి తరలించేందుకు కార్మికుల సహాయం తీసుకున్నాడు. విగ్రహాన్ని తీసుకెళ్తుండగా పైన ఉన్న 33/11 కేవీ విద్యుత్ తీగలకు విగ్రహం తగిలింది. అయితే, ఆ విగ్రహం తడిగా ఉండడంతో కరెంట్ షాక్ వచ్చి మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది కార్మికులతోపాటు నిర్వాహకుడు వినోద్ కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వినోద్, బంటి అలియాస్ సాయికుమార్ అపస్మారక స్థితికి చేరుకోగా దవాఖానకు తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అల్వాల నితిన్, వెంకట్‌రెడ్డి, కృష్ణ, సాయినాథ్, హనుమంతు, ఆకాశ్, రోషన్, ఆర్షద్‌కు కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, వినోద్‌కు భార్య వర్షిణి, ఇద్దరు కూతుళ్లు ప్రణయ, శ్రీయాన్షి ఉండగా, స్థానిక ఏస్కోనిగుట్ట కాలనీకి చెందిన సాయికుమార్ అవివాహితుడు. వినోద్ వద్ద పదేళ్లుగా పని చేస్తున్నాడు.
వెంటనే స్పందించిన స్థానికులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించారు. విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన కార్మికులను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. విద్యుత్ తీగలను కర్ర సాయంతో పక్కకు జరిపి అంబులెన్స్‌లో కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సీఐ సురేశ్‌బాబు, ఎస్ఐలు శ్రీకాంత్, రాంచంద్రం, సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే ఆరా
గాయపడ్డ కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆరా తీశారు. కోరుట్ల దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే, వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు కార్మికులను తరలించిన విషయాన్ని తెలుసుకున్న ఆయన జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేశారు. కార్మికులకు అవసరమైన అత్యవసర సేవలు అందించాలని కోరారు. కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. జగిత్యాల దవాఖానలో బాధితులను కలెక్టర్ సత్యప్రసాద్, కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావు పరామర్శించారు.