Electric shock | కోరుట్ల, జూన్ 15: కోరుట్ల పట్టణంలో ఆదివారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 8మంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మెట్పల్లి రోడ్డులో ఉన్న శ్రీబాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రాన్ని అల్వాల వినోద్ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన తయారీ కేంద్రంలో ఉన్న 12 ఫీట్ల వినాయక విగ్రహన్ని ఎండలో అర బెట్టి వర్షం వస్తుందనే అనుమానంతో మరో షేడ్‌లోకి తరలించేందుకు కార్మికుల సహాయాన్ని తీసుకున్నాడు.
గణేష్ విగ్రహాన్ని మోసుకొని వెళుతుండగా పైన ఉన్న 11/33 కేవీ విద్యుత్ తీగలకు విగ్రహం తగిలింది. విగ్రహం తడిగా ఉండడంతో కరెంట్ షాక్‌తో విగ్రహం వద్ద మంటలు చెలరేగాయి. దీంతో విగ్రహాన్ని తరలిస్తున్న 9 మంది కార్మికులతో పాటూ నిర్వాహకుడు వినోద్ విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. కాగ సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వినోద్, బంటి అలియాస్ సాయికుమార్ అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు.
తీవ్రంగా గాయపడ్డ అల్వాల నితిన్, వెంకట్‌రెడ్డి, కృష్ణ, సాయినాథ్, హనుమంతు, ఆకాష్, రోషన్, హర్షత్ లను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాశం రోడ్డు కాలనీకి చెందిన వినోద్‌కు భార్య వర్షిణి, ఇద్దరు కూతుళ్ళు ప్రణయ, శ్రీయాన్షి ఉన్నారు. స్థానిక ఏస్కోనిగుట్ట కాలనీకి చెందిన సాయికుమార్ (అవివాహితుడు).