సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 25 : తమ పెండింగ్ సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉపాధ్యాయులతో కలిసి రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు తరలివచ్చి ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రభుత్వ విద్యా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోలొండ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.