‘సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది’ అన్నట్టు తయారైంది కాంగ్రెస్ సర్కారు తీరు! విత్తన మేళాలు అంటూ హడావుడి చేసినా.. తీరా ప్రైవేట్ డీలర్స్‌తో స్టాల్స్ ఏర్పాటు చేయించి, విత్తనాలు విక్రయించింది. ప్రభుత్వం పెసర, కంది, మినుములు, కూరగాయల వంటి సీడ్స్ సబ్సిడీపై అందిస్తుందని, సర్కారు చెప్పిన ఏడు రకాల వరి విత్తనాలు నాణ్యమైనవి లభిస్తాయన్న నమ్మకంతో మేళాకు ఆశతో వచ్చిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. సబ్సిడీ ముచ్చటే లేకపోవడం, టీఎస్ సీడ్స్ దొరకపోవడంపై తీవ్ర అసంతృప్తి కనిపించింది. ప్రైవేట్ కంపెనీల విత్తనాల విక్రయానికే ప్రభుత్వం ప్రచారం చేసినట్టు ఉన్నదే తప్ప రైతులకు మేలు చేసేలా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
జగిత్యాల, జూన్ 23, (నమస్తే తెలంగాణ)/ మల్యాల : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జగిత్యాల జిల్లాలోని 33 వేదికల్లో రైతు విత్తన మేళాలను మంగళవారం ఏర్పాటు చేసింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గొల్లపల్లి మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మిగిలిన చోట్ల పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించగా, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాలు, మార్కెట్ కమిటీలు, యార్డులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేశారు. భారీ ప్రచారాన్ని నిర్వహించి, హంగూ ఆర్బాటాలతో మొదలు పెట్టారు. ఇవి వారం పాటు కొనసాగుతాయని, రైతులు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వం రూ.500 బోనస్‌కు అర్హమైనవిగా ప్రకటించిన ఏడు రకాల విత్తనాలతోపాటు పెసర, కందులు, మినుములు వంటి దినసులు, కూరగాయల విత్తనాలను విక్రయిస్తామని ప్రకటించారు.
ప్రైవేట్ డీలర్స్ దుకాణాలు
ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన రైతు విత్తన మేళాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు ఎలాంటి విత్తనాలను అందుబాటులో పెట్టలేదు. అంతే కాకుండా, ప్రైవేట్ డీలర్స్‌తో స్టాల్స్‌ను ఏర్పాటు చేయించారు. వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను ప్రభుత్వ కార్యక్రమంలోకి విక్రయించేందుకు అవకాశం కల్పించారు. సమావేశంలో గంటల కొద్ది ప్రసంగాలు చేసిన ప్రజాప్రతినిధులు తర్వాత ప్రైవేట్ డీలర్స్‌తో విత్తనాలను విక్రయించారు. దీంతో రైతులు కంగుతిన్నారు. టీఎస్ సీడ్స్ ద్వారా పెసర, కంది, మినుములు, కూరగాయల వంటి వంగడాలు, విత్తనాలను సబ్సిడీపై అందిస్తారని, ప్రభుత్వం చెప్పిన ఏడు రకాల వరి విత్తనాలు నాణ్యమైనవి లభిస్తాయన్న నమ్మకంతో మేళాకు వచ్చిన తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రైవేట్ కంపెనీల విత్తనాల విక్రయానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసినట్టు ఉన్నదే తప్ప తమకు మేలు చేసేలా లేదని బాహాటంగానే మండిపడ్డారు. మూడు నాలుగు విత్తన కేంద్రాల్లో మాత్రమే టీఎస్ సీడ్స్‌కు సంబంధించిన పెసర, మినుములు, కందుల వంటి విత్తనాలను నామమాత్రంగా విక్రయించారని చెప్పారు. అది కూడా మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్న చోట్ల ప్రైవేట్ కంపెనీల సీడ్స్ విక్రయిస్తే మీడియాలో ప్రచారం అవుతుందని భావించి టీఎస్ సీడ్స్ కవర్స్‌లో ఉన్న విత్తనాలతో ఫొటోలు మాత్రమే తీశారని ఆరోపించారు. విక్రయించిన టీఎస్ సీడ్స్ విత్తనాలు, కూరగాయల విత్తనాలకు సైతం ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ డీలర్స్ లాభం పొందేందుకు ప్రభుత్వమే విత్తన మేళాల పేరిట కార్యక్రమాలను నిర్వహించిచిందని ఆరోపించారు. వీటి కోసం రూ.లక్షల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదంటున్నారు.
సన్నాలలో స్పష్టత కరువు
సన్నరకం వరి ధాన్యాన్ని సాగు చేయాలని రైతులును ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గతంలో 33 రకాల సన్నాలను పండిస్తే వాటికి మద్దతు ధరతోపాటు రూ.500ల బోనస్ ఇస్తామని ప్రకటించింది. అయితే, 8 రకాల సన్నాలను సాగు చేస్తే మాత్రమే రైతులకు మద్దతు ధర, రూ.500 బోనస్ ఇస్తామని నెల రోజుల క్రితం మరో ప్రకటన చేసింది. అందులో బీపీటీ-5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638, కేఎన్ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, జేజీఎల్-1798 రకాలను ప్రకటించింది. పదిహేను రోజుల తర్వాత ఈ జాబితా నుంచి జేజీఎల్-1798 రకాన్ని తొలగించింది. అయితే, ఇది అధిక దిగుబడిని ఇస్తుందన్న ఉద్దేశంతోనే దీనిని తొలిగించినట్టు తెలుస్తున్నది. అయితే, అప్పటికే చాలా మంది ఈ విత్తనాలతో నార్లు పోసిన రైతులు తీవ్ర నిరసన, అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 154080)ను సైతం జాబితా నుంచి తొలగించినటుట వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. విత్తనమేళాలలో తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని ప్రమోట్ చేసిన అధికారులు, అంతర్గతంగా మాత్రం ప్రైవేట్ విత్తన డీలర్స్కు జూలై 15 వరకు ఆ రకం విత్తనాన్ని విక్రయించవద్దని సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం సన్నాల సాగుకు సంబంధించిన నిర్దేశిత జాబితాలో తరుచుగా మార్పులు చేర్పులు తేవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేం అభిప్రాయం ఇస్తే మాపని ఖతం సార్
మేళాల్లో ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యవహారశైలిపై రైతులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పలువురిని కలిసి అభిప్రాయాలను చెప్పాలని కోరగా, వారు విచిత్రంగా స్పందించారు. ‘సార్.. ఈ వ్యవహారం ఉత్తి షోపుటప్ ముచ్చట. ఈ మేళా వల్ల సర్కార్‌కు రూ.లక్షల్లో ఖర్చు తప్ప లాభం లేదు. రైతులకు అసలే ప్రయోజనం లేదు.. కేవలం ప్రైవేట్ డీలర్స్కు మాత్రమే ప్రయోజనం ఉన్నది. ఏ విత్తనంపై సబ్సిడీ లేదు. నమ్మకం లేదు. మాకు ముచ్చట అర్థమైంది. మీరు మా ఫొటోలు తీసి, మా అభిప్రాయాలు వేస్తే మాకు చాలా ఇబ్బందులు వస్తాయి సార్. అధికారుల నుంచి మొదలుకొని అధికార పార్టీ నాయకుల వరకు అందరి దృష్టిలో మేం కంటవుతం. అందుకే ఇందులో ఉన్న లోపాలు మీకు చెబుతున్నం. సార్ మా ఫొటోలు మాత్రం తీయకండి. మమల్ని ఇబ్బంది పెట్టకండి’ అంటూ సున్నితంగా చెప్పారు.