కొడిమ్యాల, ఫిబ్రవరి 22 : దళిత బందు పథకంతో రాష్ట్రంలో దళితుల జీవితాలలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. కొడిమ్యాల మండలం అప్పారావుపేటలో 16 మందికి బుధవారం దళితబంధు యూనిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల పాలనలో దళితులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల జీవితాల్లో మార్పు కనిపిస్తున్నన్నారు. అప్పారావుపేట గ్రామం అప్పులిచ్చే గ్రామంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి పైరవీలు లేకుండా దళితబంధు పథకం అర్హులైన లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు. అనంతరం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఎంపీడీవో పద్మజ, ఎంపీవో ప్రవీణ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్లు మెన్నేని రాజనర్సింగరావు, బండ రవీందర్ రెడ్డి, సర్పంచ్ గరిగంటి మల్లేశం, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పులి వేంకటేశంగౌడ్ తదితరులు ఉన్నారు. అందించిన యూనిట్లు ఇవే..అప్పారావుపేటలో 16 మందికి దళిత బంధు యూనిట్లు అందించారు. అందులో ఆరు ట్రాక్టర్లు, మూడు గూడ్స్ ఆటోలు, ఒక ప్యాసింజర్ ఆటో, రెండు కార్లు, రెండు బర్ల యూనిట్లు, ఒక సెంట్రింగ్, టెంట్ హౌస్, ఒక డీజే ఉన్నాయి.
కిరాయిలకు ఇచ్చి నడిపించుకుంటున్న
దళిత బందు పథకం ద్వారా గూడ్స్ ఆటోను కొనుక్కొని కిరాయిలకు ఇచ్చి నడిపించుకుంటున్న. నెలకు ఖర్చులు పోను రూ.10 వేలు మిగులుతున్నయ్. గతంల కుటుంబం గడుసుడే కష్టంగా ఉండేది. కూలీ పనులు చేసుకుంట కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. చివరికి అప్పులే మిగిలేవి. ఇప్పుడు అప్పులు లేకుండా సొంతంగా బతుకుతున్నం.
-బందరు భాగ్యలక్ష్మి, లబ్ధిదారురాలు
సొంతంగా సంపాదించుకుంటున్న
మొన్న టి వరకు నేను ప్రైవేట్ డ్రైవర్‌గా చేసేది. చాలీచాలని జీతంతో కుటుంబం గడుసుడే కష్టంగా ఉండేది. పెట్టుబడి పెట్టినా ఏదైన వ్యాపారం చేయాల్నంటే పైసలు లేకుండె. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కృషితో దళిత బంధు యూనిట్ మంజూరైంది. ఇక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు టెంట్‌హౌస్, డీజే కొనుక్కొని నడిపించుకుంటున్న. చాలా సంతోషంగ ఉంది.
– నమిలకొండ అనిల్, లబ్ధిదారుడు
ధీమా కలిగింది
దళిత బంధు కింద ట్రాక్టర్ కొన్న. ట్రాలీ వర్క్ చేస్తున్న. గతంల కూలీ దొరికితేనే ఇల్లు గడిచేది. ఇప్పుడు ట్రాక్టర్‌తో దీమాతో బతుకుతున్న. గ్రామంలో రోజూ ఏదో ఒక పని దొరుకుతుంది. రోజుకు వెయ్యి రూపాయల దాకా సంపాదిస్తున్న. చాలా సంతోషంగ ఉంది. కేసీఆర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
– నమిలకొండ మల్లయ్య, లబ్ధిదారుడు