మామిడి చెట్టు ముందే విరగబూసింది. సీజన్ కంటే పక్షం రోజుల ముందే చెట్టంతా పూత కనిపిస్తున్నది. మూడు నాలుగేండ్ల నుంచి దిగుబడిలేక దిగులుపడ్డ రైతాంగం, ఈ యేడు పూత మోతను చూసి సంతోషపడుతున్నది. అయితే, సేద్య రక్షణతోనే ఫలాలు చేతికందే అవకాశమున్నదని ఉద్యానవన యంత్రాంగం చెబుతున్నది. పూత నుంచి కాతకు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నది. ఫలితంగా ఆశించిన లాభాలు పొందవచ్చని చెబుతున్నది.
– జగిత్యాల, జనవరి 22 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : మామిడి పంటకు కేరాఫ్ జగిత్యాల జిల్లా. తెలంగాణలోనే అత్యధికంగా దిగుబడి నిచ్చే ప్రాంతంగా ఖ్యాతిగడించింది. ముఖ్యంగా దసేరీ, బంగినిపెల్లి రకాలకు పెట్టింది పేరు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 35వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. సగటున ఎకరం తోటలో 3.5 టన్నుల నుంచి 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఏటా ఈ జిల్లా నుంచి వేలాది క్వింటాళ్ల మామిడి పండ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.
దక్షిణ భారతదేశంలో నాగపూర్ మామిడి మార్కెట్ తర్వాత జగిత్యాల పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందింది. నాణ్యమైన, రుచికరమైన మామిడిని ఈ ఏరియా రైతాంగం పండిస్తున్నది. ఇక్కడి నుంచి సేకరించిన దసేరీ, బంగినిపెల్లి రకాల పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే మూడు నాలుగేండ్లుగా మామిడి దిగుబడి సరిగా రావడం లేదు. ప్రకృతి ప్రకోపాలు, చీడపీడలతో మామిడి రైతులు కుదేలయ్యారు. అయితే ఈ యేడాది ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయని ఉద్యానవన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రావాల్సిన సమయం కంటే పక్షం రోజులు ముందుగానే పూత వచ్చిందని,
ఈ పూత పూర్తి ఆరోగ్యకరంగా ఉందని, చీడపీడల ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూత పిందెలు వేసే స్థాయికి వచ్చిందని, నిలిస్తే ఈ యేడాది మామిడి రైతులకు మంచి దిగుబడి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే సస్యరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల ఉద్యానవన అధికారి ప్రతాప్‌సింగ్ సూచిస్తున్నారు. ఆశించే తెగుళ్లు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
తామర పురుగు..
తామర పురుగులు మామిడి పూత, కాయల నుంచి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. ఇవి 2 మిల్లీ మీటర్ల పొడవుండి, కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో చిగురు ఆకులు చిన్నవిగా ఉండి ఆ తర్వాత రాలిపోతాయి. ఈ తామర పురుగులు పుష్పగుచ్ఛాలు, పిందెలపై చర్మం గీకి రసం పీల్చడంతో వక రంగులో చర్మం బీటలు వారి రాతి మంగు ఏర్పడుతుంది. కాయ నాణ్యత పడిపోతుంది.
నివారణ: ఈ పురుగుల నివారణకు టర్మిడాల్ 1.5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి నల్లపూత దశలో అంటే పిందెలు ఎదిగే దశలో పిచికారీ చేయాలి. లేదా ల్యాండ సైహలోత్రిన్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి తెల్ల పూత దశలో అంటే పూ మొగ్గ దశలో పిచికారీ చేయాలి.
పిందె రాలడం..
పిందె రాలకుండా తగ్గించడానికి 10 లీటర్ల నీటికి 2 మిల్లీ లీటర్ల ప్లానోఫిక్స్ కలిపి పూరెమ్మలు మొత్తం తడిసేలా పిచికారీ చేసుకోవాలి. లేదా 2,4-డి 10 పీపీ ఎం (1 గ్రాము 2, 4-డీ పొడిని 100 లీటర్ల నీటిలో కలిపి) ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మరిన్ని వివరాలకు సంబంధిత ఉద్యాన అధికారిని సంప్రదించాలి.
తేనెమంచు పురుగు..
తేనే మంచు పురుగు వల్ల నవంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు అధిక నష్టం ఉంటుంది. తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పుష్పగుచ్ఛాలు, పూలు, పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో పూత, పిందె వాడి రాలిపోతాయి. అంతే కాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి తియ్యని పదార్థంపై మసి కారణమైన శీలింధ్రాలు పెరుగుతాయి. దీని వలన ఆకులపై, పూత, కాయలపై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. తోటలలో కలుపు ఎకువగా, వాతావరణం మబ్బుగా ఉండి, గాలిలో తేమ శాతం ఎకువగా, ఉష్ణోగ్రత తకువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగుల వలన 20 నుంచి 100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది.
నివారణ : తోటలో నీరు నిల్వ లేకుండా ఉంటే వీటి ఉధృతి తకువగా ఉంటుంది. లీటరు నీటికి ఫాస్పమిడాన్ (డిమేక్రాన్) 1 మిల్లీ లీటరు లేదా మొనోక్రోటోఫాస్ 2.5 మిల్లీ లీటరు చొప్పున కలిపి పూత మొదలయ్యే, పిందెలు తయారయ్యే సమయాల్లో పూత ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలి. పూత విచ్చుకోకముందే మందు చల్లాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేస్తే పుప్పొడి రాలి పరాగ సంపరానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపిస్తే కరాటే 5 ఎఫ్‌సీ లేదా కాన్ఫిడార్ 0.5 మిల్లీ లీటరు లేదా థయోమిథాక్సామ్ (అక్టారా) 0.5గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత, కాత సమయంలో తేనెమంచు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.
బూడిద తెగులు (పౌడరీ మిల్డ్యూ)
చల్లని రాత్రులు, వేడి పగటి వాతావరణంలో పూత, పిందెపై తెల్లని పొడిలాంటి బూజు ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రం ఆశించడం వల్ల పూలు, పిందెలు రాలుతాయి.
నివారణ: నీటిలో కరిగే గంధకం (సల్ఫర్) 3 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ (కాన్టాఫ్ ప్లస్) 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కొమ్మల కత్తిరింపులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం. నీటి యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం సకాలంలో పాటిస్తే అధిక, నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.