Gazetted headmasters | కోరుట్ల, జూన్ 25 : గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీలు ముందుగా చేపట్టాలని, ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పదోన్నతి కల్పించాలని టీజీ జీహెచ్ఎంఏ రాష్ట్ర అదనపు కార్యదర్శి కిషన్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ కిషన్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కోరుట్ల క్లస్టర్ స్థాయి సంఘం అత్యవసర సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 నుంచి గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా మల్టీజోన్‌లో పదోన్నతి పొంది జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలలో స్వస్థలాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో జిల్లాను ఫలితాల సాధనలో ఉత్తమ స్థాయిలో నిలిపామని పేర్కొన్నారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హెడ్మాస్టర్లకు బదిలీలు జరపకుండా స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. గెజిటెడ్ హెడ్మాస్టర్లకు బదిలీలు జరపకుండా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా సుదూర ప్రాంతాల్లో రిటైర్డ్ కావాల్సి వస్తుందని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీల తర్వాతే స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గంగుల నరేశం, మార్గం రాజేంద్రప్రసాద్, నరసింహమూర్తి, లోకిని శ్రీనివాస్, చౌడారపు రాంప్రసాద్, కండ్లెం నారాయణ, జావిద్, రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.