కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. శతాబ్ధ కాలంలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోని 12 కార్మిక సంఘాల ఫెడరేషన్లు ఈ సమ్మెకు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు రంగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సుమారు 3.50 లక్షల మంది పాల్గొనే అవకాశమున్నది. వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలతోపాటు బీఆర్ఎస్ కార్మిక విభాగం కూడా ఈ సమ్మెలో పాల్గొననున్నది.
కరీంనగర్, మే 5(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, రైతులను నిర్వీర్యం చేసే నూతన వ్యవసాయ విధానం, విద్యుత్తు బిల్లు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పలు కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. ఎన్నో దశాబ్ధాలపాటు పోరాటాలు చేసి సాధించుకున్న తమ హక్కులను కాలరాస్తూ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికులు సాధించుకున్న హక్కులో ప్రధానమైనది సంఘటితం. అందుకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి సంఘటితం కాకుండా కేంద్రం చట్టాలు చేసింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకులు, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని ఇటు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు సైతం సమ్మెలో భాగస్వాములవుతున్నారు.
ముఖ్యంగా సార్వత్రిక సమ్మెలో బీఆర్ఎస్ కార్మిక విభాగంతోపాటు వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నాయి. సింగరేణి, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రక్షణ శాఖ బ్యాంకింగ్ ఫెడరేషన్, రైల్వే ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా 12 ట్రేడ్ ఫెడరేషన్లు సంయుక్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లాలో సమ్మెను విజయవంతం చేసేందుకు బీఆర్టీయూతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ వంటి కార్మిక సంఘాలు ఐకమత్యంగా సమ్మెను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ ఉద్యోగులతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఉపా ధి హామీ కూలీలు కూడా ఈ సమ్మెలో పాల్గొనేలా చేసేందుకు సీఐటీయూ, బీఆర్టీయూ, తదితర కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎందరో కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న రోజుకు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలకు పెంచే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్‌ను రూపొందించిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కోడ్ వల్ల కార్మికులకు ఎలాంటి రక్షణ లేకపోగా అనేక హానికరమైన విధానాలు పొందుపర్చారని కార్మికులు వాపోతున్నారు. పోరాడి సాధించుకున్న అనేక హక్కులను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం ఈ చట్టాలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు నిరంతర పోరాటాలు చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. నాలుగు లేబర్ కోడ్లతో ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మ్యానిటైజేషన్ విధానం ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 2020 నుంచి 2023 వరకు యాజమాన్యాల లాభాల వాటా 38 శాతం నుంచి 51 శాతానికి పెరిగితే కార్మికుల జీతాల వాటా మాత్రం 18 నుంచి 15 శాతానికి తగ్గించారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమపై మోసపూరిత విధానాలను అమలు చేస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే మూడు నల్ల చట్టాలను తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, రైతులు తిరుగుబాటు చేయడంతో దిగి వచ్చి ఆ చట్టాలను రద్దు చేసిందని, ఇదే స్ఫూర్తిలో లేబర్ కోడ్‌ను రద్దు చేసే వరకు కార్మిక వర్గాలు పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 12 కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాలు ఇప్పటికే పలు పరిశ్రమల యాజమాన్యాలకు సమ్మె నోటీసులు అందిస్తున్నాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమల యజమానులు, హరిత బయో ప్రొడక్ట్ కంపెనీకి, ప్రియా మిల్క్స్ డెయిరీ, నాగార్జున మిల్క్ డెయిరీ, సీడ్స్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, ఆటోమొబైల్ షోరూంలు, డీ మార్ట్, ఫ్లిప్ కార్ట్లు, మోర్ సూపర్ మార్కెట్లు, తదితర షాపింగ్ మాల్స్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. చట్ట ప్రకారం ఈ నెల 14 వరకు వివిధ పరిశ్రమల యజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు మరిన్ని పరిశ్రమలకు సమ్మె నోటీసులు ఇస్తున్నామని సీఐటీయూ బాధ్యులు ఎడ్ల రమేశ్ తెలిపారు. ఒక్క కరీంనగర్ జిల్లా నుంచి లక్ష మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే విధంగా సన్నద్దం చేస్తున్నామని, తమ సంఘం ఆధ్వర్యంలోనే 50 వేల మందికి తక్కువ కాకుండా సమ్మెలో పాల్గొంటున్నారని రమేశ్ వివరించారు.