కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 6 : కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులపై మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ప్రవర్తించిన తీరుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులంతా శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
వీరికి టీఎన్జీవో నాయకులు మద్దతు తెలిపారు. గురువారం సాయంత్రం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ ఫిర్యాదు విషయంలో టీపీఎస్ తేజశ్వనిపై మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు మెండి చంద్రశేఖర్ దురుసుగా ప్రవర్తించడంతో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పందించి, అధికారులతో కలిసి కలెక్టర్‌తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు భారత్ న్యాయసంహిత 333, 307, 74, 292, 132, 352, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం మెండి చంద్రశేఖర్‌ను అరెస్ట్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా, ఈ విషయంలో ఇప్పటి వరకు అధికార పార్టీకి చెందిన వారెవరూ స్పందించిన దాఖలాలు లేవు. ఈ విషయం కాస్తా ఇప్పుడు నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు, ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులపై దురుసు ప్రవర్తన సరికాదంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది.
కఠిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగులు
మహిళా ఉద్యోగిపై మాజీ కార్పొరేటర్ దుర్భాషలాడుతూ గొడవకు దిగడం చాలా బాధాకరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై రాజకీయ విభేదాలను చూపించడం సరికాదన్నారు.
ఈ విషయంపై వెంటనే స్పందించి సహకరించిన నగర కమిషనర్, కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సువార్త మాట్లాడుతూ, అధికారులు, ఉద్యోగుల నుంచి సామరస్యంగా పనులు చేసుకోవాలే తప్ప దురుసుగా ప్రవర్తించడం సరికాదని సూచించారు. ఆందోళనలో డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ యాదగిరి, టీఎన్జీఓ పట్టణాధ్యక్షుడు హర్మిందర్‌సింగ్, నాయకులు గూడ ప్రభాకర్, రాగి శ్రీనివాస్, ఎరుమల్ల శారద, తోట రామస్వామి పాల్గొన్నారు.
కక్షసాధింపుతో అక్రమ కేసులు : మెండి శ్రీలత
ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసినందుకు మేయర్ కక్ష సాధింపుతో తన భర్తపై అక్రమ కేసులు పెట్టించారని 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత ఆరోపించారు. శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మున్సిపల్లో జరుగుతున్న అవినీతిపై పోరాడుతున్నందుకే తమపై మేయర్ సునీల్‌రావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు.
తమ డివిజన్లోని లకిరెడ్డి సుకన్య అనే వృద్ధురాలిని మున్సిపల్ అధికారులు రెండు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్నారని, ఇదే విషయంలో తన భర్త టీపీఎస్ అధికారిని తేజస్వినిని నిలదీస్తే ఆమె ఫైల్‌ను తమ ముఖం మీద కొట్టి ‘ఎవరికి చెప్తారో చెప్పుకో’ అంటూ విసిరేశారని ఆరోపించారు. తన భర్త ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకపోయేందుకు ప్రయత్నిస్తే కమిషనర్ తన భర్తను ‘గెటవుట్’ అంటూ దూషణకు దిగారన్నారు. ఈ విషయంలో మేయర్ జోక్యం చేసుకొని తమపై అక్రమ కేసు నమోదు చేయించారని వాపోయారు.