తిమ్మాపూర్, సెప్టెంబర్15: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ వారం రోజుల క్రితం నిండు కుండలా మారింది. 24.034 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 23.947 టీఎంసీల స్టోరేజీతో పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకున్నది. ఈ క్రమంలో ఎల్ఎండీ ఎగువన ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఇన్ ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో ఎల్ఎండీలోకి నీళ్లను వదిలే అవకాశం ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్ఎండీ నుంచి సోమవారం 3గేట్ల ద్వారా సుమారు 5వేల క్యూసెకుల నీటిని వదలనునట్టు ఎల్ఎండీ ఈఈ నాగభూషణ రావు తెలిపారు. గేట్ల ద్వారా నీళ్లను మానేరు వాగులోకి వదులుతున్న క్రమంలో నది పరీవాహక ప్రాంతాల్లో పశువులు, గొర్రెలు మేపేవారు, చేపలు పట్టేవారు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.