కరీంనగర్, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, దూకుడు పెంచుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు సంబంధించి హైదరాబాద్‌లో వరుస సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ, ఇక నుంచి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు నయా వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని కరీంనగర్లో నిర్వహించబోతున్నది. రేకుర్తి రాజశ్రీగార్డెన్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్వహించే ఈ సమావేశంలో వెయ్యి మందికి పైగా వారియర్స్ పాల్గొననుండగా, రామన్న దిశానిర్దేశం చేయనున్నారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిపింది. అయితే, గత ఎన్నికల సమయంలో ఇతర పార్టీలు కేసీఆర్ సర్కారుపై విష ప్రచారం చేసి, ప్రజలను పక్కదారి పట్టేలా చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నాయి. అయితే, అభివృద్ధిని మాత్రమే నమ్ముకొని ప్రజల ముందుకెళ్లిన బీఆర్ఎస్, అసత్యాలు, అబద్ధాలను తిప్పికొట్టడంలో వెనుక పడింది. ఇది జగమెరిగిన సత్యం. ఈ అసత్య ప్రచారం ముందు అభివృద్ధి ఓడిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అసత్య ప్రచారంతోపాటు నిరాధార ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ఓవైపు.. బీజేపీ మరోవైపు నేటికీ అదే బాటలో పయనిస్తున్నాయి. గత అసెంబ్లీ తరహాలోనే ఆ పార్టీలు, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ముందుకెళ్లే ప్లాన్ అమలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ నయా వ్యూహం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విషప్రచారానికి బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరోసారి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇతర పార్టీలు సిద్ధమైన తరుణంలో నయా వ్యూహాన్ని సిద్ధం చేసింది. అబద్ధాలను సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టడమేకాదు, వాస్తవాలను ప్రజల కండ్ల ముందుంచేందుకు కొత్త పంథాను ఎంచుకున్నది. అందుకోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సోషల్ మీడియా వారియర్స్‌ను ఏర్పాటు చేసుకోవడంతోపాటు వారికి మార్గదర్శనం చేయబోతున్నది. ఆ మేరకు తొలి వారియర్స్ సమావేశాన్ని బుధవారం కరీంనగర్లో నిర్వహించబోతున్నది. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17,69,040 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 150 నుంచి 200 మంది సోషల్ వారియర్స్‌ను ఏర్పాటు చేసింది. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రోజంతా జరిగే ఈ సమావేశంలో అబద్ధాలు, అసత్యాలను తిప్పికొట్టడంపై నిర్దేశం చేయడంతోపాటు వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు వారియర్స్ చేయాల్సిన విధులను వివరించడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు.
వినోద్వైపు.. అందరి చూపు
మోదీ పదేళ్ల ప్రభుత్వంలో కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లపాటు పనిచేసిన బోయినపల్లి వినోద్‌కుమార్ చెరగని ముద్ర వేశారు. 2014 ఎన్నికల్లో 2,04,652 ఓట్ల మెజార్టీతో గెలిచి, కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలోనే భారీ మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డు సాధించారు. 2006 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై ఆనాడు ఉద్యమ నేత కేసీఆర్ 2,01,582 ఓట్ల మెజార్టీ సాధించారు. కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో చూస్తే అత్యధికంగా మెజార్టీ సాధించిన ఘనత ఈ ఇద్దరికి మాత్రమే దక్కుతుంది. మోదీ పదేళ్ల ప్రభుత్వంలో వినోద్‌కుమార్ ఐదేళ్లు, బండి సంజయ్ ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు. అయితే, వినోద్‌కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలూ శ్రమించి అనేక విజయాలు సాధించారు. మచ్చుకు కొన్నింటిని చూస్తే.. 104 కోట్లతో ఉప్పల్-బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓవర్ బ్రిడ్జిని సాధించారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింప చేయడంలో విజయం సాధించారు.
అత్యధికంగా జాతీయ రహదారులే కాదు, జాతీయ రహదారుల కార్యాలయాన్ని కరీంనగర్‌కు తేవడంలో కీలక పాత్ర పోషించారు. 216 కిలోమీటర్లున్న జగిత్యాల- కరీంనగర్- హుజూరాబాద్- వరంగల్ జాతీయ రహదారి, 165 కిలోమీటర్ల పొడవున్న కరీంనగర్- సిరిసిల్ల- పిట్లం రహదారి, 184 కిలోమీటర్లు గల సిరిసిల్ల- సిద్దిపేట- జనగాం- సూర్యాపేట, 130 కిలోమీటర్లున్న ఎల్కతుర్తి- సిద్దిపేట- మెదక్, అలాగే 131 కిలోమీటర్లున్న మొలంగూరు- చెల్లూరు- జమ్మికుంట- వావిలాల- భూపాలపల్లి వంటివి సాధించి చూపించారు. అలాగే, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఆయుష్ దవాఖానను మంజూరు చేయించారు. వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని.. దేశంలోనే 7వ స్థానంలో నిలిపారు.
కరీంనగర్లో తక్కువ జనాభా ఉన్నా తన పరిణితిని ప్రదర్శించి స్మార్ట్‌సిటీ కింద ఎంపిక చేయించారు. దేశంలో 50 నిర్భయ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. అందులో కరీంనగర్లో ఒకటి ఏర్పాటు చేయించారు. ఇవేకాదు, రాజీవ్హ్రదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా కేంద్రంతో గుర్తించేందుకు, అలాగే కరీంనగర్‌కు ఐఐటీ, నవోదయ స్కూల్ సాధించడానికి ఆయన నేటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా ప్రజలతోనే ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం నిరంతరం కేంద్రంతో పోరాడుతూనే ఉన్నారు. అందుకే వినోద్‌కుమార్ అభివృద్ధి పంథా, విజన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, ఈ ఐదేళ్ల బండి సంజయ్ పాలనలో జరిగిన పనులను ప్రజలు కంపేర్ చేస్తున్నారు. వినోద్కుమార్వైపు మొగ్గు చూపుతున్నారు.
విజయాలు ఘనం.. చెప్పడంలో వైఫల్యం?
కేసీఆర్ సర్కారు హయాంలో ఉమ్మడి జిల్లా ఊహకు అందనంతగా విజయాలను సాధించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతి జరిగింది. అయితే, వాటిని ప్రజలకు వివరించడంలో బీఆర్ఎస్ దళం వెనుకబడిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లకపోవడం వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
ఉమ్మడి జిల్లాలో 14,54,569 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉంటే.. 2014కు ముందు కేవలం 6,65,255 ఎకరాలు అంటే కేవలం 45.73 శాతం మాత్రమే సాగయ్యేది. మరో 54.27 శాతం భూమి పడావుగా ఉండేది. గడిచిన తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కారు నిర్మించిన ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, ఎస్సారెస్పీపునర్జీవం వంటి పనులతో అదనంగా 7,27,968 ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. రాష్ట్రం వచ్చేనాటికి ఉన్న సాగు విస్తీర్ణంతో పోలిస్తే 137 శాతం అదనంగా సాగు పెరిగింది. అలాగే 2014లో చూస్తే.. కేవలం 4,57,725 మంది రైతులే సేద్యం చేయగా, కేసీఆర్ ప్రభుత్వంలో ఆ సంఖ్య 9.25,343కి చేరింది. వ్యవసాయ ప్రగతికి ఇది అద్దం పడుతున్నా.. చెప్పుకోవడంలో మాత్రం వెనుకబడి పోయింది. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పైపైకి చేరి సేద్యం పెరిగింది.
కేసీఆర్ సర్కారు విద్యుత్ రంగంలో ఎవరూ ఊహించనటువంటి విజయాలు సాధించింది. 2018 జనవరి ఒకటి నుంచి వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్‌ను అమల్లోకి తెచ్చింది. అలాగే, నాణ్యమైన విద్యుత్ కోసం ఉమ్మడి జిల్లాలో 650 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించింది. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ ఉపకేంద్రాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, అంతర్గత లైన్ల నిర్మాణం, కొత్తగా ఉప కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి పనులు చేసింది. 2014లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 218 విద్యుత్ ఉప కేంద్రాలు మాత్రమే ఉండగా.. వాటి సంఖ్యను 351కు పెంచింది. పదేళ్లలో కొత్తగా 133 కొత్త విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదే, ట్రాన్స్ఫార్మర్లు చూస్తే.. 2014లో 53,247 మాత్రమే ఉండగా, వాటిని 78,958కు పెంచింది. అంటే ఈ పదేళ్లలో కొత్తగా 25,711 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు కొత్తగా 79,198 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది.
2014కు ముందు ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 3,28,645 ఉండగా, ప్రతినెలా 13.13 కోట్లు ఇచ్చేది. అదే కేసీఆర్ సర్కారు హయాంలో పింఛన్ల సంఖ్య 5,88,589కి పెంచి, ప్రతినెలా 125.38 కోట్లు ఇచ్చింది. పాత వాటితో పోలిస్తే 2,59,944 పింఛన్లు కొత్తగా ఇవ్వడంతోపాటు దాదాపు 112 కోట్లకుపైగా అదనంగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది.
కేసీఆర్ సర్కారు 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా చేసి, పాలనను మరింత చేరువ చేసింది. కొత్తగా 17 మండలాలు, 193 పంచాయతీలు, మరో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. వీటితోపాటు 8 మేజర్ గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు 12 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.
చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత కార్పొరేటుకు దీటుగా సర్కారు వైద్యం అందుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖను బలోపేతం చేసింది. ఉమ్మడి జిల్లాలో 2016లో 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే వాటిని 93కు పెంచింది. అప్పుడు అన్ని దవాఖానల్లో 1,342 బెడ్స్ మాత్రమే ఉండగా.. వాటిని 2,850కి పెంచింది. అప్పుడు సిబ్బంది 3,149 మంది ఉంటే.. ఆ సంఖ్యను 4,318కి పెంచింది. నాటి ప్రభుత్వాలు మెడికల్ విద్యను పట్టించుకోలేదు. కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కళాశాల వచ్చింది. ఈ కాలేజీల్లో ప్రతి విద్యా సంవత్సరం 500 మెడికల్ సీట్లకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీల్లో 240 మంది విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ దవాఖానల్లో ఓపీల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకప్పుడు అన్ని దవాఖానాల్లో కేవలం 2,400 మందికి మాత్రమే ప్రతి రోజూ ఓపీ చూడగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 5,600కు పైగా పెరిగింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2016కు ముందు రోజుకు కేవలం 24 ప్రసవాలు జరిగితే, వాటిని 129 వరకు తీసుకెళ్లింది.
కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య
నియోజకవర్గం ఓటర్ల సంఖ్య