మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కష్టాలను బెదురులేకుండా ఎదుర్కొంటున్నారు. పిరికితనం వదిలేసి పిడికిలి బిగిస్తూ, పురుషులకు మించి తమ శక్తి, యుక్తులను చాటుకుంటున్నారు. ఇంటా బయటా అన్నింటా తమదైన ముద్రవేస్తున్నారు. ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై, విజయపథాన నడుస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు ఒకరోజూ కలెక్టర్ వచ్చారు. అతడికి దక్కిన గౌరవ మర్యాదలను చూసి ఆ స్కూళ్లోనే 5 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్ఫూర్తి పొందింది. అప్పుడే కలెక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది.. ఆమె గరిమా అగర్వాల్.. తల్లిదండుల్ర ప్రోత్సాహంతో ఆ దిశగా వడివడిగా అడుగులు వేసింది..2018 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో 40వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికై అనుకున్నది సాధించింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న గరిమా అగర్వాల్ మహిళా దినోత్సవం సందర్భంగా తన విజయ ప్రస్థానాన్ని ‘నమస్తే’తో పంచుకున్నది.
– కమాన్‌చౌరస్తా, మార్చి 7
మాది మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ పట్టణం. సాంప్రదాయ మార్వాడి కుటుంబం. ఇక్కడే హిందీ మీడియం స్కూల్లో ప్రాథమికోన్నత విద్యను చదివిన. తర్వాత హైదరాబాద్‌లో ఐఐఐటీ పూర్తి చేసిన. ఆ వెంటనే సివిల్స్‌పై దృష్టిపెట్టిన. తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికైన. అయినా పట్టువిడువకుండా తర్వాత సంవత్సరం 40వ ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించిన. కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం ఆనందంగా ఉన్నది. ఇక్కడ అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారి సహకారంతో ముందుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం సంతృప్తినిస్తున్నది. మహిళలు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి..జీవిత ప్రయాణంలో చిన్న చిన్న అపజయాలకు వెనుకడుగు వేయవద్దు..ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలి.
అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడకూడదు..ఉన్నతవిద్యకు, ఉద్యోగాలకు దూరంగా ఉంటూ వంటింటికే పరిమితం కావాలి.. అనేది ఒకప్పుడు.. కానీ ఇందుకు భిన్నంగా కరీంనగర్‌కు చెందిన రేణ సౌమ్య పిన్నవయస్సులోనే మోటీవేషన్ స్పీకర్‌గా రాణిస్తున్నది. ఆదివారం వస్తే చాలు ఆమె చెప్పే మాటల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూడడం కనిపిస్తున్నది. 18 ఏండ్ల ప్రాయంలోనే కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నది.
– కమాన్‌చౌరస్తా, మార్చి 7
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తన గురువైన మోటివేటర్ హరీశ్‌రెడ్డి మాటలు విన్న రేణ సౌమ్య తాను సైతం ఆ రంగాన్నే ఎంచుకున్నది. హరీశ్‌రెడ్డి తోపాటు తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించారు. మొదట యంగ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్నది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గురువు సహకారంతో యంగ్ ఇండియా ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించింది. ప్రస్తుతం డైరెక్టర్ స్థాయిలో పర్సనల్ స్కిల్ డెవలపర్‌గా సేవలందిస్తున్నది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఎందరో విద్యార్థులు ఇంటర్వ్యూలు, పరీక్షలను ఎదుర్కొనే విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి తన సంస్థద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. స్పీకింగ్ స్కీల్స్ పెంచడం, పర్సనాలిటీ డెవలప్మెంట్లో మెళకువలు నేర్పిస్తున్నది. అలాగే నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా సాయం చేస్తూ భరోసానిస్తున్నది.
ఇల్లందకుంట మార్చి7: చిన్నప్పటి నుంచి ఆమెకు వ్యవసాయమంటే మక్కువ. బడి నుంచి ఇంటికి రాగానే పొలం బాట పట్టేది. అదే ఇష్టంతోనే కష్టపడి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ సాధించింది. ఇప్పుడు నిత్యం రైతుల సేవలో తరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది ఇల్లందకుంట ఏవో గుర్రం రజిత. మహిళా దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’తో తన మనోగతాన్ని పంచుకున్నది. మా ఊరు వరంగల్ అర్బన్ జిల్లా పరకాల. తల్లిదండ్రులు సదానందం-రాధ సాధారణ రైతులు. మాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఊరి బడిలోనే పాఠశాల విద్యను పూర్తిచేసిన. హైదరాబాద్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన. 2009లో వ్యవసాయ శాఖలో ఏవో పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తు చేసుకున్న. మంచి ర్యాంకుతో ఉద్యోగం సాధించి తోలి పోస్టింగ్ కమలాపూర్‌లో బాధ్యతలు చేపట్టిన. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్న. వ్యవసాయమంటే ఎంతో ఇష్టమున్న నాకు రైతులకు సేవలందించే భాగ్యం లభించడం ఆనందంగా ఉన్నది. రెండుసార్లు ప్రభుత్వం ఉత్తమ అగ్రికల్చర్ అవార్డుకు ఎంపిక చేసింది. మహిళలు ఒడిదొడుకులకు ఎదురొడ్డి ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు.
కొత్తపల్లి, మార్చి 7: కరీంనగర్‌కు చెందిన పీ మల్లిక యోగాలో మెరుస్తున్నది. ఇటు కరీంనగర్ బల్దియా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆమె అటు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపుతున్నది. ఇప్పటికే పంజాబ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో నిర్వహించిన పోటీల్లో పతకాలు దక్కించుకున్నది. ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి యోగా క్రీడల్లో 5 స్థానం సాధించి సత్తాచాటింది. రాష్ట్రస్థాయి పోటీల్లో 15కు పైగా పతకాలు గెలుచుకున్న మల్లిక సర్కారు ద్వారా పలు సేవా పురస్కారాలను కైవసం చేసుకున్నది. కుటుంబ పరిస్థితుల కారణంగా కొరియోగ్రాఫర్ కావాలనే తన చిన్ననాటి కల నెరవేరకపోవడంతో యోగాపై దృష్టిపెట్టినట్లు చెబుతున్నది. తన కుమారుడు రిషిక్ సిద్దార్థ సైతం యోగాలో రాణిస్తున్నాడని పేర్కొంటున్నది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు అంటున్నది.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో సబ్బండ వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో సేవా రంగాలకు పెద్దపీట వేశారు. వైద్యానికి ప్రాధాన్యమిచ్చారు. కరీంనగర్‌కు మెడికల్ కళాశాల మంజూరు, ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ (విద్యానగర్)
రాష్ట్రంలో విద్య, వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం శుభపరిణామం. కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం హర్షణీయం. రాష్ట్రంలో మొదటి సారిగా మహిళా యూనివర్సిటీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు.
-పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ (కార్పొరేషన్)
జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఇందులో కరీంనగర్‌కు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించడం గొప్ప విషయం. ఉత్తర తెలంగాణకు గుండె కాయలాంటి కరీంనగర్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– పూరెళ్ల రాములు, న్యాయవాది (విద్యానగర్)
కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలకు కోతలు విధించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. పేదల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించారు. గతంలోని ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమానికి ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదు.
-చల్ల హరిశంకర్, టీఆర్ఎస్ నాయకులు (కార్పొరేషన్)
రాష్ట్ర బడ్జెట్లో మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 100 కోట్లు కేటాయించడం శుభ పరిణామం. గ్రామీణ ప్రాంత పేద మహిళల విద్యాభివృద్ధికి దోహదం చేస్తుంది. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటుతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
-శ్రీవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్‌యూ(కమాన్ చౌరస్తా)
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించి యావత్ భారతదేశానికి రోల్ మోడల్‌గా నిలిచారు. దళితుల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఉపయోగపడుతున్నది. సీఎం కేసీఆర్‌కు యావత్ దళితులంతా రుణపడి ఉంటరు. -బాబు, చెల్పూర్ (హుజూరాబాద్‌టౌన్)