కమాన్చౌరస్తా, అక్టోబర్ 1: విజయ దశమి హిందువులకు విశిష్టమై రోజు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగ. చిన్నాపెద్దా అందరూ ఒక్కచోట చేసుకొనే వేడుక. ఈ రోజు చేపట్టే ప్రతీ పనిలో విజయం లభిస్తుందని నమ్మకం. అందుకే శక్తి స్వరూపిణీ ఆశీస్సులతో ప్రారంభిస్తారు.
దసరా అంటే పది దుర్గుణాలపై గెలుపు సాధించేందుకు శక్తినిచ్చేది. దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలో పది అవగుణాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానవత్వ, అహంకారంపై జయించే శక్తినిచ్చేది కనుకనే దీనిని విజయదశమి అని కూడా అంటారు. కాగా, గురువారం పండుగ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.